కరోనా ఇంకా అంతం కాలేదు: రాష్ట్రపతి
న్యూఢిల్లీ (CLiC2NEWS): కరోనా పోరాటం ఇంకా ముగిసిపోలేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు.కొవిడ్ సెకండ్ వేవ్‌లో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ రాష్ట్రపతి పంద్రాగస్టు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
“లాక్‌డౌన్ వల్ల ప్రభావితమైన రంగాల ఊతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా విపత్తు వేళ కూడా సాగు రంగంలో వృద్ధి చెందింది. కరోనాను ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా 50 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశారు. సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది“ అని తెలిపారు.
`కరోనా మహమ్మారి ఇంకా పోలేదు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలి. ఈ మహమ్మారి నియంత్రణకు మన శాస్త్రవేత్తలు టీకాలను అభివృద్ధి చేయడంలో విజయవంతం కావడం వల్లే అవి మనకు రక్షణ కవచంలా ఉపయోగపడుతున్నాయి. కరోనా కట్టడికోసం పనిచేసిన వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది.. అలాగే కరోనా వారియర్లందరికీ అభినందనలు. వారి సేవలే కరోనా సెకండ్‌వేవ్‌ను అదుపుచేయడంలో దోహదపడ్డాయి. “ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.