ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని

న్యూఢిల్లీ : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు ఆయన రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు. మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అజయ్‌భట్ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసి, గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు..ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
“స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను నేడు దేశం స్మరించుకోంటోంది. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీరజవాన్లకు ప్రణామాలు. కరోనాపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానం. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య సిబ్బంది కృషి ఎంత చెప్పినా తక్కువే.. అలాగే ఎలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి. పతకాలు సాధించిన వారికి దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోంది. వాళ్లు కేవలం పథకాలే కాదు దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచారు.
దేశ విభజన గాయం నేటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నాయి.
అలాగే కరోనా మహమ్మారి చుట్టుముట్టినపుడు టీకాల లభ్యతపై అనుమానం తలెత్తింది. భారత్ ప్రజలకు టీకాలు దొరుకుతాయా అనే అనుమానం వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 54 కోట్ల మందికి టీకాలు అందించాం. కొవిన్ యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారులు స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రులు, ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.