ఎంత‌టి క‌రువు వ‌చ్చినా హైద‌రాబాద్‌కు నీటి కొర‌త ఉండ‌దు

సుంకిశాల ప్రాజెక్టు ప‌నుల‌కు కెటిఆర్‌ శంకుస్థాప‌న

హైద‌రాబాద్ (CLiC2NEWS): సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణంతో హైద‌రాబాద్ న‌గ‌రానికి భ‌విష్య‌త్‌లో కూడా నీటి స‌ర‌ఫ‌రాకు ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని మున్సిప‌ల్ శాఖ మంత్రి కెటిఆర్‌ పేర్కొన్నారు. కృష్ణా న‌ది నుంచి హైద‌రాబాద్ న‌గ‌రానికి నీటిని త‌ర‌లించ‌డానికి గానూ నాగార్జున సాగ‌ర్ స‌మీపంలో రూ.1,450 కోట్ల వ్య‌యంతో నిర్మిస్తోన్న సుంకిశాల ఇన్‌టేక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణానికి శ‌నివారం ఆయ‌న శంకుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాబోయే ఎండాకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 50 ఏళ్ల ముందుచూపుతో సుంకిశాల ప్రాజెక్టును చెప‌ట్టామ‌ని, ఈ ప్రాజెక్టు పూర్తైతే వ‌రుస‌గా ఐదేళ్లు క‌రువు ప‌రిస్థితులు వ‌చ్చినా కూడా హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీటికి కొర‌త ఉండ‌ద‌ని పేర్కొన్నారు. ప్ర‌తీ సంవ‌త్స‌రం వేస‌విలో న‌గ‌రానికి కృష్ణా నీటిని త‌ర‌లించేందుకు ఎమ‌ర్జెన్సీ పంపింగ్ చేయాల్సి వ‌స్తోంద‌ని, ఇందుకు ఐదారు కోట్లు ఖ‌ర్చ‌వుతోంద‌న్నారు. సుంకిశాల ప్రాజెక్టుతో ఈ అవ‌స‌రం ఉండ‌ద‌ని తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టు ద్వారా తాగునీటికే కాకుండా అవ‌స‌ర‌మైతే పారిశ్రామిక అవ‌స‌రాల‌కు కూడా నీటిని వినియోగించుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.

భ‌విష్య‌త్‌లో కృష్ణా ఫేజ్ 4, 5 కోసం కూడా ఇప్పుడే సివిల్ వ‌ర్కులు చేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం న‌గ‌రానికి 37 టీఎంసీల నీరు అవ‌స‌రం ప‌డుతోంద‌ని, 2072 నాటికి 71 టీఎంసీల నీరు అవ‌స‌రం ప‌డుతుంద‌ని అంచ‌నా వేసిన‌ట్లు తెలిపారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు కూడా స‌రిపోయేలా కొత్త ప్రాజెక్టులు చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. సుంకిశాల‌తో పాటు కాళేశ్వ‌రం ద్వారా హైద‌రాబాద్ న‌గ‌ర త‌ల మీద 60 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంద‌న్నారు. న‌గ‌రానికి నీరు చేర్చే వ్య‌వ‌స్థ‌లో ఒక చోట ఆటంకం ఏర్ప‌డినా న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు నీటి స‌ర‌ఫ‌రాకు ఇబ్బంది లేకుండా ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు. దేశంలో శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న న‌గ‌రాల్లో హైద‌రాబాద్ ముందుంద‌ని, రాబోయే 15 ఏళ్ల‌లో ఢిల్లీ త‌ర్వాత దేశంలో రెండో పెద్ద న‌గ‌రంగా హైద‌రాబాద్ మారుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ… హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌తంలో తాగునీటి క‌ట‌క‌ట ఎక్కువ‌గా ఉండేద‌ని, ఖాళీ బిందెల‌తో ధ‌ర్నాలు జ‌రిగేవన్నారు. మిగ‌తా ముఖ్య న‌గ‌రాల్లో నీటి కొర‌త ఇంకా తీవ్రంగా ఉంద‌ని, కానీ, మ‌న హైద‌రాబాద్‌లో మాత్రం ఇప్పుడు ఎలాంటి స‌మ‌స్య లేకుండా నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నీటి కొర‌త తీర్చిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు.

జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్ మాట్లాడుతూ.. ప్ర‌తీ ఏడాది వేస‌విలో న‌గ‌రానికి కృష్ణా నీటిని త‌ర‌లించేందుకు ఎమ‌ర్జెన్సీ పంపింగ్ చేయాల్సి వ‌చ్చేద‌ని, ఇందుకు ఏటా ఐదారు కోట్లు ఖ‌ర్చ‌య్యేద‌న్నారు. సుంకిశాల ప్రాజెక్టు ద్వారా ఈ అవ‌సరం ఉండ‌ద‌న్నారు. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర స‌ముదాయాంలో నీటి స‌ర‌ఫ‌రాకు ఈ ప్రాజెక్టు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది అన్నారు. సుంకిశాల‌తో న‌గ‌రానికి స్థిర‌మైన నీటి ల‌భ్య‌త ఉంటుంద‌ని, వ‌ర్షాభావ ప‌రిస్థితుల్లో సైతం హైద‌రాబాద్‌కు స‌రిప‌డా నీరు అందుబాటులో ఉంటుంద‌ని పేర్కొన్నారు. మ‌రో యాభై ఏళ్ల‌కు స‌ర‌ప‌డా నీటిని అందించ‌డానికి ఈ ప్రాజెక్టు ద్వారా వీలు క‌లుగుతుంద‌న్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా జ‌ల‌మండ‌లి దాదాపు రూ.6 వేల కోట్ల ప‌నుల‌ను ఏక‌కాలంలో చేప‌డుతోంద‌ని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌మూద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జ‌ల‌మండ‌లి ఈడీ డా.ఎం.స‌త్య‌నారాయ‌ణ‌, టెక్నికల్ డైరెక్ట‌ర్ ర‌వి కుమార్‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.