రోజూ 60 టికెట్లకు పైగా కొంటారు..కానీ ప్రయాణం చేయరు
తమ ఊరిలో రైలు హాల్టింగ్ రద్దు కాకూడదని..

నెక్కొండ (CLiC2NEWS): కొందరు వ్యక్తులు రైల్వే స్టేషన్లో రోజూ 60కి పైగా టికెట్లు కొంటారు.. కానీ వారు ప్రయాణం చేయరు. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్లో ఇలా రోజూ జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. తమ ఊరిలో రైలు హాల్టింగ్ రద్దు కాకుండా ఉండేందుకు ఈ విధంగా టికెట్లు కొంటున్నారు. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఏకైక రైల్వే స్టేషన్ కావడంతో మండలాల నుండి ఇక్కడికి వస్తుంటారు. తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, శిరిడి తదితర ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే అధికారులు పద్మావతి ఎక్స్ ప్రెస్ రైలు తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్లో హాల్టింగ్ రద్దు చేసింది. ప్రయాణికుల విన్నపంతో సికింద్రాబాద్ నుండి గుంటూరు వెళ్లే ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్ తాత్కాలిక హాల్టింగ్ కల్పించింది. అంతే కాకుండా మూడు నెలలపాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని .. లేకపోతే రద్దు చేస్తామని షరతు విధించారు.
దీంతో ఆ ప్రాంతవాసులు హాల్టింగ్ కోల్పోకూడదని విరాళాలు సేకరిస్తున్నారు. నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం పేరుతో వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నారు. వ్యాపారస్తుఉల, దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటివరకు రూ. 25 వేలు సేకరించారు. ఈ సొమ్ముతో ప్రతి రోజూ నెక్కొండ నుండి ఖమ్మం, సికింద్రాబాద్, తదితర ప్రాంతాలకు టికెట్లు కొంటున్నారు. రైలు హాల్టింగ్ కోసం వారంతా ఈ విధంగా చేస్తున్నట్లు సమాచారం.