TS: మే 31 వరకూ రెండో డోస్ వారికే వ్యాక్సిన్

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో మే 31 వరకు రెండో డోసు వారికే టీకా ఇస్తామని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కాగా రెండో డోసుకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని నేరుగా వ్యాక్సిన్‌కు వెళ్లవచ్చన్నారు.
కాగా ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లోనే లాక్‌డౌన్ విధించిందని ఆయన అన్నారు. ప్రభుత్వం అనుమతించిన 4 గంటల్లోనే బయటకు రావాలని సూచించారు. బయటకు వచ్చిన సందర్భంలో కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
రెమ్‌డెసివిర్ వంటి ఔషధాలు వైద్యుల సలహా మేరకే వాడాలన్నారు. రెమ్‌డెసివిర్‌కు ప్రత్యామ్నాయ ఔషధాలు కూడా ఉన్నాయన్నారు. ప్రజలు సహకరిస్తేనే లాక్‌డౌన్‌తో సత్ఫలితాలు వస్తాయన్నారు. మే 31 లోపు ఇంకా 15 లక్షల మందికి రెండో డోసు టీకా ఇవ్వాలన్నారు. ప్రస్తుతం 12 వందలకు పైగా ఆస్పత్రుల్లో కొవిడ్ సేవలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. గత వారం రోజుల్లో సర్వే ద్వారా 2.6 లక్షల మెడికల్ కిట్లు అందించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పాజిటివిటి రేటు తక్కువగానే ఉందన్నారు.
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల కొరత లేదన్నారు. ఆసుపత్రుల్లో పడకల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రస్తుతం 5,783 ఆక్సిజన్ పడకలు, 17,267 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదన్నారు.
దేశ వ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ గురించి ఆందోళన వ్యక్తమవుతున్న నేపత్యంలో డిఎంఈ రమేశ్ రెడ్డి వివరాణ ఇచ్చారు. కొవిడ్ సోకిన ప్రతి ఒక్కరికీ బ్లాక్ ఫంగస్ రాదని అన్నారు. గాంధీ ఆసుపత్రిలో కేవలం 3 బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని.. అవి కూడా ప్రైవేటు నుంచి వచ్చాయని డిఎంఇ వివరణ ఇచ్చారు.