TS: 19 జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో డ‌యాగ్నొస్టిక్ కేంద్రాల‌ను ఈ నెల 7న ప్రారంభించాల‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితులు, వైద్య సేవ‌లు, ప‌లు అంశాల‌పై ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి అధికారుల‌తో చ‌ర్చించారు. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు.

రోగం కంటే ప‌రీక్ష‌ల ఖ‌రీదే ఎక్కువైంద‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. ప్ర‌యివేటు ఆసుప‌త్రుల‌కు వెళ్లి వేల‌కు వేలు ఖ‌ర్చు చేయాల్సిన దుస్థితి నెల‌కొంద‌ని సిఎం అభిప్రాయ‌ప‌డ్డారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, జనగాం, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, అదిలాబాద్, గద్వాల, అసిఫాబాద్.. జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో కొత్త‌గా ఏర్పాటు చేసిన డయాగ్నోసిస్ కేంద్రాలను ప్రారంభించాలనిఅధికారులకు ముఖ్య‌మంత్రి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అధికారులు సిఎం అడిగి తెలుసుకున్నారు.

వైద్యంలో అత్యంత కీలకమైన రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం రాష్ట్ర వైద్య చరిత్రలో గొప్ప సందర్భమని తెలిపారు. ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ముఖ్య‌మంత్రి తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటుగా… రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ,థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు వుంటాయని తెలిపారు. సాధారణ పరీక్షలే కాకుండా, అత్యంత అరుదుగా చేసే ఖరీదుతో కూడుకున్న ప్రత్యేక పరీక్షలను కూడా పూర్తిగా ఉచితంగా చేసి తక్షణమే రిపోర్టులిస్తారని సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.