TS Corona: 2వ దశలో 2.37 లక్షల కరోనా కేసులు: డీహెచ్ శ్రీనివాసరావు
హైదరాబాద్ (CLiC2NEWS): కొవిడ్ నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ్ కట్టడికి తెలంగాణ మార్గదర్శిగా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. మీడియాతో డీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా తగ్గిందన్నారు. ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని డీహెచ్ శ్రీనివాస రావు చెప్పారు. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. పాజిటివిటీ రేటు కూడా తగ్గిందని చెప్పారు. రెండో దశలో రాష్ట్రంలో 2.37 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. కొవిడ్ కట్టడికి తెలంగాణ మార్గనిర్దేశంగా మారిందన్నారు. గ్రామాల్లో కొవిడ్ నియంత్రణలో ఉందని.. కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నామని చెప్పారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో సరిపడా పడకలు ఉన్నట్లు తెలిపారు. 40 శాతానికి పైగా పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో నిండాయన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ పడకలు 33 శాతం ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ప్రణాళికాబద్ధంగా అవసరమైన వారందరికీ చికిత్స అందిస్తున్నట్లు డీహెచ్ తెలిపారు. సర్కారు దవాఖానాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. రెమ్‌డెసివిర్, బ్లాక్ ఫంగస్‌కు సంబంధించిన మందులు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్‌ఫై కేంద్ర మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు డీహెచ్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి 57.30 లక్షల వ్యాక్సిన్ డోసులు వచ్చాయన్నారు. కొవాగ్జిన్ సెకండ్ డోస్ తీసుకోవాల్సినవారు ఇంకా 3 లక్షల మంది ఉన్నారన్నారు. ప్రస్తుతం 50 వేల కోవాగ్జిన్ డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.