ఎమ్మెల్సీగా వాణీదేవి ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ (CLiC2NEWS): దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి ఎమ్మెల్సీగా ఆదివారం ప్రమాణం స్వీకారం చేశారు. శాసనమండలిలో వాణీదేవి చేత ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేకే కేశవరావు, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వాణీదేవి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
ఈ సందర్భంగా వాణీదేవి మాట్లాడుతూ.. రాజకీయం వాతావరణంలో పెరిగాను.. ప్రజాసేవ చేయడానికి పదవి అక్కర్లేదని అనుకున్నానని తెలిపారు. కానీ అధికారం ఉంటే ప్రజలకు మరింత ఎక్కువ సేవ చేయొచ్చు అనుకున్నాను.. అప్పుడే తనకు సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారు.. అని వాణీదేవి తెలిపారు.
గత మార్చిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుపై విజయం సాధించారు. వాణీదేవికి 1,89,339 ఓట్లురాగా, బీజేపీ అభ్యర్థికి 1,37,566 ఓట్లు పోలయ్యాయి.