విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-24)

అదేమీ లేదండి. మీరు పనుల ఒత్తిడిలో ఉంటారు, ఇబ్బంది పెట్టడం ఎందుకంటూ వచ్చాం. అయినా ఇతర హోటళ్లకు ఎందుకు వ్యాపారం పెంచడం అనుకొని మీ హోటల్‌కే కదా వచ్చింది అంటూ నవ్వాడు కుటుంబరావు. స్నేహితులు మధ్య వ్యాపారం ఏమిటీ, మీరు కూడా అలా అంటున్నారు, అయినా మన హోటల్ ఇది. మీరు బిల్లులు చెల్లిస్తారా ఏమిటంటూ మొహమాటపడ్డాడు. వెంటనే వెయిటర్‌ను పిలిచి, ఈ టేబుల్‌కు బిల్లు తేవద్దు. నేను కూడా ఇక్కడే భోజనం చేస్తా అని ఆదేశించాడు.అయ్యో వద్దండి. మీరు మాతోపాటు భోజనం చేయండి, మీ బిల్లు కూడా కలిపి తెమ్మనండి. వెరయిటీగా ఉంటుంది. అంటూ బిల్లు చెల్లించాల్సిందే నంటూ విజయ్ పట్టుబడుతుండగా ముందు తిందాం తర్వాత ఈ విషయం అంటూ కుటుంబరావు అనడంతో ఆ చర్చ ఆగిపోయింది.

బేరర్‌ను పిలిచిన భుజంగరావు, వీళ్ల ఆర్డర్‌ను పక్కన పెట్టి మన హోటల్‌లో స్పెషల్ వంటకాలు ఒక్కటొక్కటిగా తీసుకు రా, అర్జంట్‌గా

సర్వ్ చేయాలి, మళ్లీమళ్లీ వీరు మన హోటల్‌కు రావడంతో పాటు ఇప్పుడు తెచ్చినవే వాళ్లు ఆర్డర్ ఇచ్చే విధంగా వేడివేడిగా తీసుకురా అంటూ పురమాయించాడు. యజమానికి వారు అతిధులని భావించిన బేరర్ సంతోషంగా తలూపుతూ వెళ్లాడు. ఇవి వచ్చేవరకు మరో పెగ్ తీసకుందామా అంటూ చెప్పడంతో సరే అన్నాడు కుటుంబరావు.

భోజనం ముగిసే వరకు కొంత ఆలస్యం అయినప్పటికీ సంతృప్తిగా భోజనం చేశామని, వారు భుజంగరావుకు థాక్స్ చెప్పారు. విజయ్ మరోసారి బిల్లు ప్రస్తావనతేవడంతో ఈ సారికి వద్దు లెండి అని చెప్పినా విజయ్ అంగీకరించలేదు. నేను వీళ్లను తీసుకు వచ్చాను , ఈ సారికి బిల్లు తీసుకోండి. మరోసారి నేనే వస్తాను అది కూడా మీకు చెప్పిన తర్వాతనే..అప్పుడు పెద్ద బిల్లు చేస్తాను సరేనా అంటూ విజయ్ పట్టుబట్టడంతో బేరర్‌ను పిలిచి, వారు ఆర్డర్ చేసిన వరకు బిల్లు తీసుకురా అన్నాడు.

విజయ్ గారు చెబితే వినాల్సిందే మనం. కదూ అంటూ కుటుంబరావు వైపు చూశాడు భుజంగం.

అవును కదా మనం డిసెంబర్ 31 న కూడా ఇదేెటల్‌లో ఢిన్నర్ చేశామని విజయ్ గుర్తు చేయడంతో ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశారు. దీన్ని విజయ్ కూడా గమనించాడు. అవును మీరు తొందరగా వెళ్లిపోయారు ఆరోజు అని భుజంగం అన్నారు. మరోరోజు మిమ్ములను కలుస్తానని చెప్పిన విజయ్ బేరర్ తెచ్చిన బిల్లును చెల్లించడానికి తన క్రెడిట్ కార్డును ఇచ్చాడు.

హోెట‌ల్ నుంచి బయటిరాగానే విజయ్ వద్ద టోకెన్ తీసుకొన్న డ్రైవర్ కారు తెచ్చిపెట్టారు. వారి డోర్ వద్దకు వచ్చిన భుజంగం వారికి సాధరంగా వీడ్కోలు తెలిపారు. త్వరగానే మళ్లీ కలుద్దామంటూ ఆయన వెళ్లిపోగా, కారు స్టార్టు అయి ముందుకు కదిలింది. ఇప్పుడు తల్లీకూతుర్లు వెనుక కూర్చున్నారు. దీంతో వారి మధ్య సంభాషణలు పెద్దగా చోటచేసుకోలేదు. రోడ్డుపైనే ద్యాస పెట్టి విజయ్ డ్రైవ్ చేస్తూ వారింటివరకు పోనిచ్చాడు. గుడ్‌నైట్ చెప్పి క్వార్టర్‌కు కారును పోనిచ్చాడు.

రాష్ట్రంలొ వరదల పరిస్థితి సద్దుమణిగింది. కేంద్ర బృందం పర్యటన తర్వాత ముఖ్యమంత్రి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి నష్టం అధికంగా జరిగిందని కేంద్ర బృందం కూడా అభిప్రాయపడిందని, ఎక్కువ నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని హామీ ఇచ్చరన్నారు. రాష్ర్ట ప్రభుత్వం బాధితులకు తక్షణ సహాయం ఇప్పటికే అందించిందని, కేంద్రం నుంచి నిధులు రాగానే వరదల వల్ల నష్టం జరగకుండా శాశ్వత కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. కొందరు మంత్రులు శాసనసభ్యుడు విజయ్ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.. దీనికి మీ కామెంట్ ఏమిటని ఒక విలేకరి ప్రశ్నించగా,అలాంటిదేమీ లేదు. విజయ్ మా పార్టీ సభ్యుడు,అంకితభావంతో పనిచేస్తున్న నేత. నిబద్దత కలిగిన ఆయనపై ఎవరూ ఏమి చెప్పినా నేను విశ్వసించను. విజయ్ విషయం మీకు కూడా తెలుసు కదా అంటూ మీడియా సమావేశం ముగించారు.

వార్తలు వింటున్న విజయ్‌కు, ముఖ్యమంత్రిపై మరింత గౌరవం పెరిగింది. తనంటే ఆయనకు ఉన్న అభిమానానికి ఆనందపడ్డాడు. తన శ్రేయోభిలాషిగా ఉన్న సిఎంకు ఇబ్బందికలిగించేలా ఇక ముందు తన ప్రవర్తన ఉండరాదని అనుకున్నాడు. అదే సమయంలో పిఎ నుంచి ఫోన్.

సార్, మీకు చెప్పాను కదా ఒక వ్యక్తి మిమ్ములను కలవాలని పదేపదే అడుగుతున్నాడు. రేపు రమ్మని చెప్పమంటారా అని. సరే రమ్మను అంటూ ఫోన్ కట్ చేసిన విజయ్‌కు మళ్లీ ముఖ్యమంత్రి మాటలే గుర్తుకు వచ్చాయి. ఆ వయస్సులో కూడా ప్రజల కోసం తపనపడుతున్నాడు. కానీ మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే ప్రభుత్వంపై వచ్చినట్లే కదా, మరి సిఎం ఎందుకు వారిని భర్తరఫ్ చేయడం లేదో అర్థం కావడం లేదు విజయ్‌కు. అయినా అక్రమాలు జరిగితే పత్రికల్లో వచ్చే వరకు ప్రభుత్వానికి సమాచారం ఉండదా? ఎన్ని నిఘా సంస్థలున్నాయి, వాటికి ఐఎఎస్,ఐపిఎస్ అధికారులే హెడ్స్‌గా ఉంటారు. ఎంతో మంది సిబ్బంది పనిచేస్తుంటారు. వీరి జీతభత్యాలకు పెద్దయెత్తున ప్రజాధనం వ్యయం చేస్తున్నప్పుడు ఈ సంస్థలు ప్రభుత్వంలో నిధుల వృధాను అరికట్టే సలహాలు,సూచనలు అందించాలి కదా? ఏమి చేస్తున్నది ఈ యంత్రాంగమంతా అంటూ ఆలోచనలో పడ్డాడు విజయ్. అవినీతి నిరోధక శాక, విజిలెన్స్ విభాగాలకు తోడు ఇంటలిజెన్స్ విభాగం మరింత కీలకంగా ఉంటుంది.నేరుగా ముఖ్యమంత్రికే ఈ విభాగాలు భాద్యత వహిస్తాయి. మరి అక్రమార్కుల భరతం పట్టడానికి ముఖ్యమంత్రి ఎందుకు వెనుకాడుతున్నారో..సిఎంను కలిసి ఒకసారి చర్చించాలని అనుకున్నాడు.

మర్నాడు ఒక వ్యక్తి చేతిలో ఫైళ్లతో వచ్చాడు విజయ్ దగ్గరకు.

నీవే కదూ వారం రోజులుగా నన్ను కలవాలని ప్రయత్నిస్తున్నావు.అర్జంట్ విషయమా అంటూ ప్రశ్నించాడు.

అవును సర్, మీరైతేనే ఈ విషయానికి న్యాయం చేస్తారని మిమ్ములను కలవడానికి ప్రయత్నించాను సార్.

అలాగా…అర్జెంట్ అని తెలిస్తే ముందుగానే రమ్మని పిలిచే వాన్ని. విషయం ఏమిటీ, ఆ ఫైళ్లు ఏమిటీ?

సార్ ఇదో భారీ కుంభ కోణం. ఎక్సయిజ్ శాఖలో అవినీతి. పెద్దయెత్తున డబ్బు చేతులు మారిన తర్వాతనే ఈ జిఒలు జారీ అయ్యాయి. రాష్ర్టంలో మద్య నిషేధం అమలులో ఉండగా మరింత మద్యం తయారీకి కంపెనీలకు అనుమతిస్తూ ఈ నిర్ణయాలు తీసుకోవడంలో మతలబు ఏమిటో మీకు తెలుసు. సారా వ్యతిరేక ఉద్యమం రాష్ర్టంలో పెద్దయెత్తున జరిగిన నేపథ్యంలో మద్య పాన నిషేధానికి ప్రభుత్వం నిర్ణయించి ప్రకటించిన విషయం మీకు కూడా తెలుసు. వెంటనేమొత్తంగా అమలు చేయలేమని, పాక్షిక నిషేధం అన్నారు. కొన్ని మినహాయింపులిచ్చారు. కదా మరి తాగుడును ప్రోత్సహించేలా ఈ జిఒలు ఏమిటి సార్.
అవును ఉత్పత్తిని పెంచుతామనుకుంటే నిషేధానికి తూట్లు పొడిచినట్లే. కొత్తగా బ్రూవరీలకు, డిస్టలరీలకు అనుమతి ఇవ్వడం ఏ విధంగానూ సమంజసం కాదు. మరి ఎలా జరిగింది ఇది. తీవ్రమైన ఈ విషయంపై ముందుగా పత్రికల వారికి లీక్ చేయకపోయావా? అంటూ ప్రశ్నించాడు విజయ్. దీనికి ఆ వ్యక్తి,

లేదు సర్ వాళ్లకు సమాచారం ఇస్తే ప్రచురించే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల సొమ్ము కోసం పత్రికా యాజమాన్యాలు కొన్ని వ్యతిరేక వార్తలు ఏవీ ప్రచురించడం లేదు. ఒకవేల పత్రికల్లో వచ్చినా ఏ చిన్న వార్తను ఒక మూలన వేస్తారు. అది ఎవరూ చూడకుండా పోతుంది.

అలాగా. మరి నేను మీడియా సమావేశం పెడితే మాత్రం వేస్తారా.

తప్పకండా సార్.ఎందుకంటే అది మీ ప్రకటన కదా వారికి పేచీ ఉండదు. బాధ్యత ఉండదు. ప్రభుత్వానికి వ్యతిరేకమైనా వాళ్లు విజయ్‌గారు చెప్పారు,ప్రచురించామని తప్పించుకుంటారు. దీంతో ప్రభుత్వ పెద్దలు కూడా ఏమీ అనరు.

అదేమిటీ నేను జర్నలిస్టుగా పనిచేశాను. ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు. నేను తెచ్చిన వార్తలన్నింటినీ ప్రచురించారు కదా. ఏమో కాలానుగుణంగా వస్తున్న మార్పులు ఇవి. చూద్దాం. ముందుగా అన్ని విషయాలు పరిశీలించుకొని నిర్ధారణ కావాలి నాకు.

అలాగే సార్. ఫైల్ పూర్తిగా చదవండి మీకే సులువుగా బోధపడుతుంది అన్నాడు వచ్చిన వ్యక్తి.

అదేమిటో పత్రికలు ఇలా ఎందుకు తయారయ్యాయి. నేను విలేకరిగా చేరినప్పుడు శిక్షణ తరగతులకు హాజరైన మా సీనియర్ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తుకు వస్తున్నాయి. ఆయన తన అనుభవాన్ని మూడు ముక్కల్లో చెప్పాడు.

ఏమిటది సార్.

పత్రికల్లో వచ్చిన వార్తలకు అంత వపర్ ఉంటుందని నాకు ఆనాడు తెలిసింది. మా సీనియర్ రాసిన వార్తకు ఎక్సయిజ్ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాదు రాజీనామా చేయకతప్పలేదు. కేవలం ఒకే వార్తతో ఇది సాధ్యమైంది. ఇక ముఖ్యమంత్రియే గద్దెను పోగొట్టుకోవడానికి మరో వార్త కారణమైందని ఆయన తన అనుభవాన్ని చెబుతుంటే శిక్షణకు వచ్చిన మేమంతా శ్రద్ధగా వినడంతోపాటు జర్నలిజంలోనే స్థిరపడాలని అనుకున్నాం. కానీ నాకు రాజకీయంగా అవకాశం లభించడంతో ఎంఎల్‌ఎగా పోటీ చేసి గెలుపొందాను. అయినప్పటికీ నాకు ఆ వాసన పోలేదు. చెడు కనిపిస్తే, అవినీతి గురించి ఉప్పందితే చాలు, వెంటనే బయట పెట్టాలని, మంచి జరగాలనే ఆరాటం కలుగుతుంది నాలో. తర్వాతి పరిణామాలు ఎలా ఉన్నా, అన్నాడు విజయ్.

(సశేషం)

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: విజయుడు (ధారావాహిక న‌వ‌ల‌ పార్ట్‌-23)

Leave A Reply

Your email address will not be published.