జ్ఞానపీఠ్ అందుకున్న 12వ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా

రాయ్‌పుర్ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హిందీ రచయిత వినోద్ కుమర్ శుక్లాకు దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ వరించింది. శుక్లా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్న 12 వ హిందీ రచయిత . ఛత్తీస్‌గఢ్ నుండి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత వినోద్ కుమార్ శుక్లాయే. 2024 కి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞానపీఠ్ ఎంపిక కమిటి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ పురస్కారం కింద రూ.11లక్షల నగదు, సరస్వతీ దేవి కాంస్య ప్రతిమ, ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.
సృజనాత్మక, విలక్షణ రచనా శైలిలో హిందీ సాహిత్యరంగానికి అందించిన విశిష్ట సేవలకు గాను శుక్లా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. రాజ్‌నంద్‌గావ్‌లో 1937 జనవరి 1న శుక్లా జన్మించారు. అగ్రికల్చర్ ఎమ్మెస్సీలో పట్టా పొందారు. రాయ్‌పుర్ వ్యవసాయ కళాశాలలో అధ్యపకుడిగా పనిచేశారు. ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రయోగాత్మక రచనలు చేశారు. ఆయన రచించిన దివార్ మే ఏక్ ఖిడ్‌కి రహ్‌తి థి నవలకు 1992లో సాహిత్య అకాడమి పురస్కారం వరించింది.