మహిళలు ఆర్ధికంగా, రాజకీయంగా ఎదగాలి: మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఆంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శుక్రవారం రవీంత్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఇప్పటికే మహిళలు ప్రగతినిసాధిస్తున్నారని, సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగారని అన్నారు. మహిళా సామర్థ్యాన్ని గుర్తించిన సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా ఎస్సి, ఎస్టి మహిళల కోసం 53 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశారని, అంతే కాకుండా 4 పారిశ్రామిక వాడ ప్రాంతాలను ఏర్పాటు చేశారని మంత్రి గుర్తుచేశారు.
దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికి చిన్నచిన్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ విచారం వ్యక్తం చేశారు. అందరిలోనూ మార్పు రావాలని అపుడే మహిళలు ఇంకా అభివృద్ధి చెందుతారని, తద్వారా దేశంకూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులను, పలువురు మహిళా ప్రతినిధులను ఘనంగా సత్కరించారు.