Mancherial: అండర్ బ్రిడ్జి: సిమెంట్ దిమ్మకూలి కార్మికుడు మృతి!
Workers dead in Under Bridge Work
మంచిర్యాల (CLiC2NEWS): జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ పనుల వద్ద సోమవారం అపశృతి చోటు చేసుకుంది. బ్రిడ్జి కింద పనిచేస్తున్న కార్మికుడు రూపన్ సైదులు పై సిమెంట్ దిమ్మ పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన సైదులును సహచరులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లాకు చెందిన సైదులు (35) రైల్వే ట్రాక్ పక్కన ఉన్న సిమెంట్ దిమ్మ కూలి మృతి చెందాడు. రైలు అండర్ బ్రిడ్జి పనులు చేస్తున్న కార్మికులు ఉదయమే వచ్చి ట్రాక్ కింద నిర్మిస్తున్న సొరంగం పనులు చేపట్టారు. కొద్దిసేపటి తర్వాత రైలు రావడంతో కొంత మంది బ్రిడ్జి కింద నుంచి బయటకు వచ్చినా సైదులు మాత్రం బ్రిడ్జి కింద తన పనితాను చేసుకుంటున్నాడు. అయితే రైలు వెళ్తున్న సమయంలో సిమెంట్ దిమ్మ మీద పడడంతో సైదులు కు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం వరంగల్ కు తరలిస్తుండగ మృతి చెందాడు.
మృతునికి భార్య నిరోష తోపాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య పిల్లలు మృతదేహంపై రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. మృతుడి బంధువులు న్యాయం జరగాలంటూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.