ఆరు నెలలు యువత సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి: మంత్రి కెటిఆర్
మహబూబ్‌నగర్ (CLiC2NEWS): నిరుద్యోగ యువత రాబోయే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్‌గా ప్రిపరేషన్ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సూచించారు. మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్స్పో ప్లాజా వద్ద టిఆర్ ఎస్ పార్టీ జెండాను మంత్రి శ్రీనివాసగౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తో కలిసి కెటిఆర్ సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఎక్స్పో ప్లాజాలో శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి కెటిఆర్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ సుమారు 90వేల ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ చేపట్టారని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి మేరకు పట్టణానికి అవసరమైన నిధులు మున్సిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెకటేశ్వర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కార్పొరేషన ఛైర్మన్లు ఇంతియాజ్, వాల్యా నాయక్, వేంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.