అప్పుడు ఇండియా సాయం చేసింది.. ఇప్పుడు మేమూ చేస్తాం: బైడెన్‌

వాషింగ్ట‌న్ (CLiC2NEWS): కరోనాతో సతమతమవుతున్న ఇండియాకు అవ‌స‌ర‌మైన అన్ని రకాల స‌హాయం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌, ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్‌. క‌ష్ట స‌మ‌యాల్లో ఇండియా త‌మ‌కు అండ‌గా నిలిచింద‌ని, ఇప్పుడు తాము కూడా అదే ప‌ని చేస్తామ‌ని బైడెన్ ట్వీట్ చేశారు.

కరోనా కట్టడిలో ఉపయోగపడే కీలక వైద్య పరికరాలు, ఇతర సరఫరాలను భారత్‌కు పంపనున్నామని తెలిపారు.

మొదటి దశ విజృంభణ సమయంలో అమెరికా ఆసుపత్రులపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా.. భారత్‌ తమకు అండగా నిలబడిందని బైడెన్‌ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆపదలో ఉన్న భారత్‌కు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

కొవిషీల్డ్‌ టీకా తయారీకి కావాల్సిన ముడిపదార్థాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేస్తూ ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవన్‌ చేసిన ప్రకటనను బైడెన్‌ తన ట్వీట్‌కు జత చేశారు.

ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హ్యారిస్ కూడా ఇండియాకు అవ‌స‌ర‌మైన సాయం చేస్తామ‌ని మ‌రో ట్వీట్‌లో తెలిపారు. ఈ కొవిడ్ క్లిష్ట స‌మ‌యంలో ఇండియాకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు మ‌ద్ద‌తు, ఇత‌ర వైద్య ప‌రికరాల‌ను పంపించ‌డానికి భార‌త ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తున్నాం. క‌రోనాతో పోరాడుతున్న అక్క‌డి హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు, భార‌త ప్ర‌జ‌ల కోసం ప్రార్థిస్తున్నాం అని క‌మ‌లా ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.