అర్ధరాత్రి యువతి మృతదేహానికి అంత్యక్రియలు!

గుండె పగిలేలా రోదించిన బాధితురాలి తల్లి

ల‌క్నో : సామూహిక అత్యాచారానికి గురై. తీవ్ర గాయాల‌తో ప‌దిరోజుల‌కు పైగా మృత్యువుతో పోరాడి ఓడిపోయిన హ‌త్రాస్ అత్యాచార బాధితురాలి న్యాయం చేసే విష‌యంలో పోలీసుల తీరు అనుమానాస్ప‌దంగా ఉంది. ఆమె మృత‌దేహాన్ని ఢిల్లీలోని ఆసుప‌త్రి నుంచి నేరు హ‌త్రాస్‌కు త‌ర‌లించి అక్క‌డే అంత్య‌క్రియ‌ల‌ను నిన్న అర్ధ‌రాత్రి 2:30 గంట‌ల‌కు పోలీసులు నిర్వ‌హించారు. ఆమె అంత్య‌క్రియ‌ల‌కు కుటుంబ స‌భ్యుల‌ను పోలీసులు అనుమ‌తించ‌లేదు. నిందితుల‌కు ఉరి శిక్ష విధించాల‌ని బాధితురాలి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేస్తూ.. పోలీసుల వాహ‌నానికి, అంబులెన్స్‌కు అడ్డుప‌డ్డారు. తామే ఇవాళ ఉద‌యం ఆమె మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని పోలీసుల‌ను కోరామ‌ని మృతురాలి సోద‌రుడు పేర్కొన్నారు. కానీ పోలీసులు కుటుంబ స‌భ్యుల మాట విన‌కుండా రాత్రికి రాత్రే కుటుంబ స‌భ్యులను రానివ్వ‌కుండా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.మృతురాలి కుటుంబ స‌భ్యులు, బంధువుల నివాసాల‌కు తాళం వేయ‌డంతో.. వారు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అక్క‌డ పోలీసుల‌ను భారీగా మోహ‌రించారు. మొత్తానికి పోలీసుల తీరుపై స్థానికులు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

 

ఇంట్లో పెట్టి తాళం వేశారు..

పోలీసులు మంగళవారం ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున, రాత్రి రాత్రే అంత్యక్రియలు చేయాలని పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులకు సూచించారు. అయితే ఇది తమ సంప్రదాయానికి విరుద్ధమని, శవాన్ని ఇంటికి తీసుకువెళ్లి, రేపు ఉదయమే దహనం చేస్తామని ఆమె తండ్రి పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపదవాదాలు జరగాయి. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు, బాధితురాలి బంధువులు వారి వాహనాలకు అడ్డుగా నిలిచి నిరసన తెలిపారు. అయినప్పటికీ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో పోలీసులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూతురిని కడచూపునకు నోచుకోకుండా చేశారంటూ ఆమె తల్లి గుండెలు బాదుకుంటూ రోదించడం అందరి మనసులను మెలిపెట్టింది.

(త‌ప్ప‌క చ‌ద‌వండిః  గ్యాంగ్‌రేప్‌కు గురైన యుపి యువతి మృతి)

 

కాగా సెప్టెంబ‌ర్ 14వ తేదీన 20 ఏళ్ల యువ‌తిని పంట పొలాల్లోకి తీసుకెళ్లి.. నాలుక కోసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఢిల్లీలోని స‌ఫ్దార్‌జంగ్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెలువెత్తాయి. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ఆయా పార్టీల నాయ‌కులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు. సామూహిక అత్యాచారానికి గురై ఢిల్లీ ఆస్పత్రిలో కన్నుమూసిన దళిత యువతి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నిర్భయ ఘటనను తలపించిన ఈ ఉదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఫిర్యాదు తీసుకోవడంలోనూ, ఇప్పుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు.

 

 

సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్‌
హత్రాస్‌ హత్యాచార ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హత్రాస్‌ దారుణోదంతం కేసులో సత్వరం చర్యలు తీసుకోవాలని మోదీ ఆదేశించారు. కాగా ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి లోతైన విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.