ఆదిలాబాద్‌లో  బయట పడ్డ నకిలీ వైద్యుడి బాగోతం

ఆదిలాబాద్:ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించగా ఓ ఆర్‌ఎంపీ ఎంబీబీఎస్‌గా ప్రజలకు వైద్యం చేస్తున్న విషయం బయటపడింది. డీఎంహెచ్‌ఓ రాఠోడ్‌ నరేందర్‌, డీఎస్‌ఓ వైసీ శ్రీనివాస్‌, మరో అధికారి అడెపు మహేందర్‌ దస్నాపూర్‌, రాంనగర్‌లలో నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ దవాఖానాలను తనిఖీ చేశారు. ఆర్‌ఎంపీ వైద్యులు అర్హతకు మించి వైద్యం చేయటంతో పాటు యాంటీబయాటిక్‌ మందులు విరివిగా వాడటంతో పాటు సెలైన్‌లు సైతం ఎక్కిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు. ఒక వైద్యుని వద్ద అబార్షన్‌ చేయటానికి ఉపయోగించే ఖాళీ సూది మందు సీసాను సైతం గుర్తించారు.

ఆర్‌ఎంపీ వైద్యుడిని ప్రశ్నిస్తున్న డీఎంహెచ్‌ఓ రాఠోడ్‌ నరేందర్‌

పట్టణంలో ఆర్‌ఎంపీలే ఎంబీబీఎస్‌లు
దస్నాపూర్‌లో బాలాజీ పాలిక్లీనిక్‌ పేరుతో ఆసుపత్రిని కొనసాగిస్తున్న వైద్యుడొకరు కోల్‌కతాలో అల్టర్‌నేటివ్‌ మెడిసిన్‌ కోర్సు చేసినట్లు పేర్కొంటూ తన పేరు పక్కన ఏకంగా ఎంబీబీఎస్‌(ఎఎం-అల్టర్‌నేటివ్‌ మెడిసిన్‌)గా రాసుకోవటం గుర్తించారు. ఇతను ప్రజలను మోసం చేయటానికి ఎంబీబీఎస్‌గా రాసుకున్నట్లు డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. ఈ వైద్యుడే గతంలో బేల మండల కేంద్రంలోనూ ఆసుపత్రిని నిర్వహించగా అక్కడ అతనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వైద్యుడు తన పేరు పక్కన ఎంబీబీఎస్‌ రాసి రిజస్టర్‌ నెంబరు 01907 సైతం రాశాడు. వాస్తవంగా ఈ నెంబరు ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన మరో వైద్యురాలి పేరిట వైద్య శాఖలో నమోదై ఉంది. ఆర్‌ఎంపీ వైద్యులు అర్హత లేకున్నా వైద్యం అందించటంతో పాటు మోతాదుకు మించి మందులను రోగులకు అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. ఆర్‌ఎంపీ వైద్యులు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాల్సి ఉంటుందన్నారు. నిబంధనలను అతిక్రమించి చికిత్సలు అందిస్తున్న వైద్యులకు తాఖీదులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు

Leave A Reply

Your email address will not be published.