ఆస్పత్రి నుంచి రజనీకాంత్‌ డిశ్చార్జ్‌

హైదరాబాద్‌ : ర‌క్తంపోటులో హెచ్చు త‌గ్గుల కార‌ణంగా చికిత్స నిమిత్తం హైద‌రాబాద్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో చేరిన ద‌క్షిణ భార‌త అగ్ర‌క‌థానాయ‌కుడు ర‌జ‌నీకాంత్ ఆదివారం మ‌ధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. అయితే ర‌జ‌నీ త్వ‌రగా కోలుకునేందుకు వైద్యులు కొన్ని సూచ‌న‌లు చేశారు.

వారం రోజుల పాటు ర‌జ‌నీ పూర్తి విశ్రాంతి తీసుకోవాల‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితుల నేప‌థ్యంలో కొవిడ్‌సోకే అవ‌కాశం ఉన్న ఏ కార్య‌క్ర‌మంలోనూ పాల్గొన వ‌ద్ద‌ని సూచించారు. అదే స‌మ‌యంలో ఒత్తిడిని త‌గ్గించేందుకు చిన్న చిన్న వ్యాయామాలు చేయాల‌ని తెలిపారు. గ‌తంలో కిడ్ని ట్రాన్స్‌ఫ్లాంటేష‌న్ చేయించుకున్న దృష్ట్యా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. డిశ్చార్జ్‌ అనంతరం హైదరాబాద్‌ నుంచి నేరుగా చెన్నై బయలుదేరనున్నారు. అతని వెంట కుమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు.

కాగా ‘అన్నాత్తే’ సినిమా చిత్రీకరణలో భాగంగా రజనీకాంత్‌ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 22న మొత్తం చిత్ర బృందానికి నిర్వహించిన కరోనా టెస్టుల్లో నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అనంతరం ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ క్రమంలోనే ఈనెల 25న ఉదయం రజనీకాంత్‌కు రక్తపోటు అధికం కావడంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. రజనీ క్షేమంగా తిరిగిరావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.