ఇక అందరికీ శ్రీవారి దర్శనం
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం విషయంలో టీడీడీ నిబంధనలు తొలగించింది. 10 ఏండ్లలోపు పిల్లలను, 65 ఏండ్లలోపు పైబడిన వృద్ధులను సైతం దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం నిబంధనల్లో మార్పు చేసింది. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది. స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో దర్శనం చేసుకోవాలని సూచించింది. పిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్ల సౌకర్యం ఉండదని స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో కొన్నినెలలుగా చిన్నారులు, వృద్ధులు తిరుమల శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు. నూతన నిబంధనలతో ఇకపై అందరికీ దర్శనభాగ్యం లభించనుంది.
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటల నుంచి వైకుంఠ ద్వార ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ మేరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ప్రతిరోజూ 20 వేల టికెట్లు అందుబాటులో ఉంచారు. కేవలం 10 గంటల సమయంలో 2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి.