ఇద్దర్ని వరించిన `ఆర్థిక` నోబెల్
స్టాక్‌హోం: ఆర్థిక శాస్త్రంలో ఈ సంవత్సరం ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి అమెరికా అర్థిక వేత్తలను వరించింది. వేలం విధానంలో మార్పులను, నూతన వేలం విధానాలను రూపొందించిన పౌల్ ఆర్ మిల్గ్రామ్, రాబర్ట్ బీ విల్సన్‌లకు ఎకనామిక్స్‌లో నోబెల్ పురస్కారం దక్కింది. వీరిని నోబెల్‌తో సత్కరించనున్నట్లు స్వీడిష్ కమిటీ స్టాక్‌హోమ్‌లో ప్రకటించింది. వేలం వేయడం అనేది ప్రతి చోట ఉంటుందని, అది మన రోజువారి జీవితాలపై ప్రభావం చూపుతుందని నోబెల్ కమిటీ వెల్లడించింది. పౌల్ మిల్గ్రామ్, రాబర్ట్ విల్సన్‌లు కనుగొన్న కొత్త వేలం విధానాల వల్ల అమ్మకందారులకు, కొనుగోలుదారులకు, పన్నుదారులకు లాభం చేకూరినట్లు నోబెల్ కమిటీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. రేషనల్ బిడ్డర్ల గురించి విల్సన్, బిడ్డింగ్‌లో పాల్గొన్నవారిలో ఉండే వ్యత్యాసాల గురించి పాల్ మిల్గ్రామ్ కొత్త ఫార్మాట్లను తయారు చేశారు. కాగా 1969 నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నారు. ఇప్పటి వరకు 51 సార్లు ఈ అవార్డును ప్రకటిచారు. 84 మంది ఆర్థిక వేత్తలు నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. గత ఏడాది ఆర్థికశాస్త్రంలో ఈస్తర్ డుఫ్లో, అభిజిత్ బెనర్జీ దంపతులు నోబెల్ బహుమతి గెలుచుకున్న విషయం తెలిసిందే.