ఈటలపై ఆరోపణలు.. మొదలైన విచారణ
మెదక్ (CLiC2NWS): తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి మెదక్ జిల్లా అచ్చంపేటలో అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఇవాళ (శనివారం) ఉదయం విచారణ ప్రారంభించారు. మంత్రిపై వచ్చిన ఫిర్యాదులు చేసిన రైతుల నుంచి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈటల రాజేందర్ అసైన్డ్ భూముల కబ్జా చేశారని నిన్న (శుక్రవారం) ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రైతులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఫిర్యాదుపై సిఎం సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణలో విజిలెన్స్ ఎస్పీ మహోహర్ పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం మాసాయిపేట మండలం అచ్చంపేటకు చేరుకున్న అధికారులు.. మంత్రిపై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అసైన్డ్‌దారులను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తున్నారు. తూప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో గ్రామంలోని భూములను సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి ఈటలకు చెందిన హేచరీస్‌లో, దాని పక్కనే ఉన్న అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే చేస్తున్నారు. తుఫ్రాన్ డిఎస్పీ కిరణ్‌కుమార్ నేతృత్వంలో మంత్రి ఈటల ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు శామీర్‌పేట్‌లో మంత్రి ఈటల నివాసానికి ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ఈటలకు అనుకూలంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా అచ్చంపేట, హకీంపేట మధ్య, మంత్రి ఈటల ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు.