ఉగ్ర పోరులో ఇద్దరు తెలుగు జవాన్లు వీర మరణం

చిత్తూరు: జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. అందులో ఇద్దరు తెలుగు జవాన్లు కూడా ఉన్నారు. వారిలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ రెడ్డి ఒకరు కాగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ మరొకరు. జవాన్ల మరణాలతో వారి వారి స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
చాలా గర్వంగా ఉంది.. ఆయన ఙ్ఞాపకాలతో బ్రతికేస్తా: అమర జవాన్ ప్రవీణ్ రెడ్డి భార్య
తన భర్త దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉందని అమర జవాన్ ప్రవీణ్ రెడ్డి భార్య రజిత అన్నారు. ఆర్మీ జవాన్ భార్యను అయినందుకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. తన తండ్రి కూడా ఆర్మీ జవాన్ అని, ఆయన కూడా దేశం కోసమే ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్నారు. ఒక ఆర్మీ జవాన్ కుమార్తెగా పుట్టినందుకు, మరో ఆర్మీ జవాన్‌కు భార్య అయినందుకు తన జీవితం ధన్యమైందని తెలిపారు. తమకు పెళ్లై పదేళ్లు అయ్యిందని.. ఇన్ని ఏళ్లలో ప్రవీణ్ ఎన్నో మధుర ఙ్ఙాపకాలను ఇచ్చారని వాటితోనే బ్రతికేస్తానని బరువెక్కిన హృదయంతో చెప్పుకొచ్చారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన చీకలప్రతాప్ రెడ్డి, సుగణమ్మ దంపతుల ఏకైక కుమారుడు చీకల ప్రవీణ్‌కుమార్ రెడ్డి (37) డిగ్రీ వరకు చదివాడు. గ్రామానికి చెందిన చాలామంది సైన్యంలో పనిచేస్తుండడం చూసి తాను దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. 18 ఏళ్ల క్రితం మద్రాసు రెజ్మెంట్–18లో చేరారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విధుల్లో చురుగ్గా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం జమ్మూకాశ్మీర్‌లోని కుష్వారా సెక్టార్ లోని మాచెల్ నాలా పోస్టు వద్ద దేశంలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించే ఆపరేషన్‌లో 15 మంది బృందంలో ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ఆరుగురు ఉగ్రవా దులు జరిపిన దాడుల్లో ప్రవీణ్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు భారత్ సైనికులు మృతిచెందారు. సంక్రాంతి పండుగకు వస్తానని చెప్పిన కొడుకు అనంతలోకాలకు చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రవీణ్ కుమార్‌రెడ్డికి భార్య, ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల కుమారుడు ఉన్నారు.
రాడ్యా మహేశ్ త్యాగం మరువలేనిది..
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్ ర్యాడ మహేశ్(26) వీర మరణం పొందారు. మహేశ్ 2015లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు. మహేశ్ 6వ తరగతి వరకు వేల్పూర్ మండలం కుకునూర్ ప్రభుత్వ పాఠశాలలో, 7-10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్ ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు. మహేశ్‌కు తల్లి ర్యాడ గంగు, తండ్రి గంగమల్లు, అన్న భూమేశ్ ఉన్నారు. మహేశ్ ఏడాది క్రితం సుహాసినిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం ఇంటికి వచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్లాడు. మహేశ్ మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
(వీర సైనికుడా.. తెలంగాణ నీకు అండగా నిలుస్తుంది: మంత్రి ప్రశాంత్ రెడ్డి)