వీర సైనికుడా.. తెలంగాణ నీకు అండగా నిలుస్తుంది: మంత్రి ప్రశాంత్ రెడ్డి
మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోం : డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్ : కశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్ ర్యాడ మహేశ్(26) వీర మరణం పొందారు. మహేశ్ 2015లో ఆర్మీ జవాన్‌గా విధుల్లో చేరాడు. మహేశ్ 6వ తరగతి వరకు వేల్పూర్ మండలం కుకునూర్ ప్రభుత్వ పాఠశాలలో, 7-10వ తరగతి వరకు వేల్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివారు. బాల్యం నుంచి దేశభక్తి భావాలు ఉన్న మహేశ్ ప్రత్యేక ఆసక్తితో ఆర్మీలో చేరారు. మహేశ్‌కు తల్లి ర్యాడ గంగు, తండ్రి గంగమల్లు, అన్న భూమేశ్ ఉన్నారు. మహేశ్ ఏడాది క్రితం సుహాసినిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం ఇంటికి వచ్చి నెల రోజుల పాటు ఉండి వెళ్లాడు. మహేశ్ మృతి వార్త తెలియడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
ముష్కర మూకలతో జమ్ముకశ్మీర్‌లో జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన తెలంగాణ యోధుడు ఆర్ మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్, వేల్పూర్ వాసిగా తాను అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర రోడ్లు – భవనాలు, గృహ నిర్మాణ మరియ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
“వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేష్ చిన్న తనం నుంచే అమితమైన దేశభక్తి… దేశం మీద ప్రేమతో సైన్యం లో చేరి భారతావని కోసం నీవు చేసిన త్యాగం మరువలేనిది. భౌతికంగా మానుండి దూరమైన బాధ ఉన్నా…దేశం కోసం ప్రాణాలర్పించడం స్ఫూర్తి దాయకం. వీర సైనికుడా యావత్తు తెలంగాణ నీకు నివాళి అర్పిస్తుంది. మహేష్ త్యాగం వెలకట్టలేనిదైనా…రాష్ట్ర ప్రభుత్వం తరుపున మహేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వేల్పూర్ వాసిగా నేను అండగా ఉంటాం. మహేష్ తో పాటు వీరమరణం పొందిన సైనికులకు నా జోహార్లు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారికి ఆ భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్న. వీర జవాన్ల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న”. అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
(కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఆర్మీ అధికారితో పాటు.. ముగ్గురు జవాన్లు, ఉగ్రవాదులు మృతి)
ఏడాది క్రితం లవ్ మ్యారేజ్..
మహేష్ చిన్నప్పటి నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వాలని కలలు కన్నారు. దీంతో కష్టపడి చదివి పోటీ పరీక్షల్లోనూ పాస్ అయ్యారు. ఇక ఏడాది క్రితం హైదరాబాద్‌కి చెందిన ఆర్మీ కమాండర్ కుమార్తె సుహాసినిని మహేష్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 8 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చిన మహేష్.. తిరిగి వెళ్లి, జమ్ము కశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 2న తోటి జవాన్లతో కలిసి పెట్రోలింగ్‌కి వెళ్తున్నానని.. వచ్చాక ఫోన్ చేస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే అవే చివరి మాటలు అయ్యాయని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు.
మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోం : డీజీపీ మహేందర్‌రెడ్డి
కోమన్‌పల్లి వాసి మహేశ్ మృతిపై రాష్ర్ట డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ ద్వారా డీజీపీ స్పందిస్తూ.. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు ధన్యవాదాలు అన్నారు. మీ వీరత్వం ఎప్పటికీ మరచిపోలేమన్నారు.
వీర జవాన్ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంది: ఎమ్మెల్సీ కవిత
మహేశ్ మృతిపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా స్పందించారు. “ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకుని అమరుడైన నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్ కు ఘన నివాళి. వీరోచిత పోరాటంలో దేశం కోసం తన ప్రాణాలను వదులుకున్న వీర జవాన్ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంది.“ అని ట్వీట్ చేశారు.
Thank you for keeping us safe, your heroism will never be forgotten. https://t.co/HmFLj7OUH0
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) November 8, 2020
ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకుని అమరుడైన నిజామాబాద్ జిల్లా కోమన్‌పల్లికి చెందిన ర్యాడా మహేశ్ కు ఘన నివాళి. వీరోచిత పోరాటంలో దేశం కోసం తన ప్రాణాలను వదులుకున్న వీర జవాన్ కుటుంబానికి తెలంగాణ జాతి అండగా ఉంది #MachilSector pic.twitter.com/aBbXqhwkZR
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 9, 2020
[…] వీర సైనికుడా.. తెలంగాణ నీకు అండగా నిలు… […]