ఎపి సర్కార్‌కు మరో షాక్

న్యూఢిల్లీ : ఎపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మూడు రాజధానుల అంశం, సిఆర్‌డిఎ చట్టాన్ని రద్దు చేయాలంటూ ఎపి ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులు ఎత్తేయాలని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలిపింది. హైకోర్టులో విచారణ గురువారం ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని తెలిపింది. ప్రభుత్వ వాదనలు హైకోర్టులోనే వినిపించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కాగా, తొలుత ఈ పిటిషన్‌లు భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ.బాబ్డే ధర్మాసనం ఎదుటకు వచ్చాయి. అయితే ఆయన కుమార్తె రుక్మిణి బాబ్డే ఆ పిటిషన్‌లను దాఖలు చేసిన వారిలో ఒకరి తరపున న్యాయవాదిగా ఉన్నందున ఆయన విచారణ నుండి తప్పుకున్నారు. దీంతో ఈ పిటిషన్‌లు జస్టిస్ అశోక్‌భూషణ్ విచారణ చేపట్టారు. పరిపాలన రాజధానిని వైజాగ్‌కి మార్చడానికి అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ తరపు న్యాయవాది రాకేష్ ద్రివేది కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం అనుమతికి నిరాకరించింది. త్వరగా కేసును విచారించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు సూచించింది.