ఎస్పీ బాలుకు కరోనా నెగిటివ్

చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు తాజాగా చేసిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో విడుదల చేశారు. తన తండ్రికి కరోనా నెగిటివ్ అని వచ్చినప్పటికీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా మెరగవ్వలేదని చరణ్ తెలిపారు. ఊపిరితిత్తుల పనితీరు మెరుగవ్వడంతో వెంటిలేటర్ తొలగిస్తామని భావించామని, అయితే ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఊపరితిత్తులలో ఇంకా ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తొలగిపోలేదని తెలిపారు. అయితే గతం కంటే నాన్న మెరుగ్గా ఉన్నారని, ఐపాడ్‌లో క్రికెట్, టెన్నిస్ చూస్తున్నారని, ఐపిఎల్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారని ఎస్పీ చరణ్ చెప్పారు. కరోనా పోరాడుతూ అగస్టు 5వ తేదీన ఎస్పీ బాలు చెన్నై ఎంజిఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్, ఎక్మోసాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు బాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.