ఏపీలో నవంబరు 2 నుండి పాఠశాలలు
బడుల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

అమరావతి : ఆంధ్ర్రప్రదేశ్ లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నవంబరు 2 నుంచి స్కూళ్లు పున:ప‌్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్‌రెడ్డి వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పున:ప‌్రారంభంపై సీఎం స్పందించారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. పాఠశాలలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వకు మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు. భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. రెండు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే.. మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలన్నారు. నవంబర్ నెలలో ఇది అమలవుతుందని, డిసెంబర్‌లో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే.. వారి కోసం ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు. పాఠశాలల నిర్వహణ వేళలపై పరిస్థితి మేరకు డిసెంబరులో మరోసారి నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం జగన్ స్పష్టం చేశారు.