ఓజోన్ గ్యాస్‌తో వైరస్ వ్యాప్తికి చెక్

టోక్యో: ప‌్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీనిని అరికట్టలేక అగ్రరాజ్యాలే తలలు పట్టుకుంటున్నాయి. కరోనాకి మందు కనుక్కోడానికి దాదాపు అన్ని దేశాల్లో పరిశోధనలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు వ్యాక్సిన్‌లు చివరి దశకు వచ్చాయని పలు సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. కానీ ఈ మహమ్మారి వ్యాప్తి నిరోధించే మందు ఇప్పటి వరకు లేదు.. కేవలం మాస్క్‌లే శ్రీరామ రక్ష అంటూ నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ శాస్ర్తవేత్తలు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ గ్యాస్ కరోనా వైరస్ కణాలను తటస్తం చేయగలదని తెలిపారు. అందువల్ల ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలు వంటి ప్రదేశాల్లో దీన్ని డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌గా ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఫుజిటా హెల్త్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఓజోన్ వాయువు 0.05 నుంచి 0.1 పీపీఎం, మానవులకు హానిచేయనిదిగా భావించే స్థాయి వైరస్‌ని చంపగలదని గుర్తించాము అన్నారు
జపాన్ శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రయోగంలో కరోనా వైరస్ శక్తి 90 శాతం తగ్గినట్లు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సైంటిస్ట్ తకాయుకి మురాటా మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం కోసం.. ప్రజలు ఉన్న వాతావరణంలో కూడా నిరంతర, తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును పంపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అధిక తేమతో కూడిన పరిస్థితుల్లో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని మేము గుర్తించాము’ అన్నారు.