ఓటరు నమోదుకు మరో అవకాశం

హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకం. ప్రజల చేతిలో వజ్రాయుధం. ఎవరిని గద్దెనెక్కించాలన్నా, దించాలన్నా ఓటుతోనే సాధ్యం. దీంతో ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. తప్పులు లేని ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు చర్యలు చేపడుతోంది.
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పేర్ల నమోదుకు మరో అవకాశం కల్పించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏండ్లు నిండుతున్న వారు ఇందుకు అర్హులు. జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో ఫాం- 6ను తీసుకొని పూర్తిచేసి ఇస్తే సరిపోతుంది. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్‌సైట్ నుంచి కూడా దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆన్‌లైన్ ద్వారా కూడా పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఓటర్ల తుది జాబితాను వచ్చే జనవరి 15వ తేదీన ప్రచురిస్తారు. మరోవైపు, మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితా సవరణ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. వచ్చే జనవరి 8వ తేదీ వరకు ఓటరుగా నమోదుతోపాటు, తప్పొప్పుల సవరణకు అవకాశం ఉంది. ఈ ఓటర్ల తుది జాబితాను జనవరి 22వ తేదీన ప్రచురిస్తారు.