‘కళాతపస్వి’ని కలిసిన మెగాస్టార్

హైదరాబాద్: ప‌్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. దీపావళి సందర్భంగా సతీసమేతంగా ఆయన ఇంటికి చేరుకుని గురువుగారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. విశ్వనాథ్ దంపతులకు నూతన వస్త్రాలు పెట్టి పాదాభిందనం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. ఇందులో చిరంజీవిని ఆప్యాయంగా విశ్వనాథ్ దగ్గరకు తీసుకున్న చిత్రం ఆకట్టుకొంటోంది.
తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చి, జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి మధ్య గురు శిష్యుల అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘విశ్వనాథ్ గారిని కలవాలనిపించింది. అందుకే ఈ రోజు ఆయన ఇంటికి వచ్చాను. ఆయన నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారు. దీపావళి వేళ ఆయనను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అన్నారు.
ఇక ట్విటర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకుంటూ.. ‘‘అందరికి దీపావళి శుభాకాంక్షలు! పండగ అంటే మన ఆత్మీయులని కలవటం,ఇంట్లో పెద్దవారితో సమయం గడపటం..అందుకే ఈ పండగ రోజున మా సినిమా కుటుంబంలోని పెద్దాయన, నాకు గురువు మార్గదర్శి,ఆత్మబంధువు కే.విశ్వనాధ్ గారిని కలిసి,ఆ దంపతులని సత్కరించుకున్నాను.వారితో గడిపిన సమయం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది’’ అని చిరంజీవి పోస్టులో పేర్కొన్నారు
అందరికి దీపావళి శుభాకాంక్షలు!పండగ అంటే మన ఆత్మీయులని కలవటం,ఇంట్లో పెద్దవారితో సమయం గడపటం..అందుకే ఈ పండగ రోజున మా సినిమా కుటుంబంలోని పెద్దాయన,నాకు గురువు మార్గదర్శి,ఆత్మబంధువు కే.విశ్వనాధ్ గారిని కలిసి,ఆ దంపతులని సత్కరించుకున్నాను.వారితో గడిపిన సమయం సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. pic.twitter.com/FlWOfgzDDT
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 14, 2020