కొత్త రెవెన్యూ బిల్లుకు కేబినెట్ ఓకే

హైదరాబాద్: ప‌్రగతిభవన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కొత్త రెవెన్యూ బిల్లుతోపాటు, వివిధ బిల్లులు, సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలంటూ బీసీ కమిషన్ చేసిన సిఫారసులకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆయూష్ వైద్య కళాశాలల్లో అధ్యాపకుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచే ఆర్ఢినెన్స్‌ను కేబినెట్ ఆమోదించింది. తెలంగాణ కోర్టు ఫీజు, సూట్స్ వాల్యుయేషన్ చట్టం-1956 సవరణ బిల్లుతో పాటు 17 కులాలను బిసి జాబితాలలో చేర్చాలంటూ బిసి కమిషన్ చేసిన సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. కాగా శాసనసభ సమావేశాలపై, సభలో వ్యూహప్రతివ్యూహాలపై సుధీర్ఘంగా చర్చించారు.