ఖేల్‌ రత్న అందుకున్న ఐదుగురిలో ముగ్గురు మహిళలు

న్యూఢిల్లీ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పలువురు క్రీడాకారులకు రాష్ట్ర్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్రీడా పురస్కారాలను అందజేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మొదటిసారిగా వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది దేశంలోని పలువురు క్రీడాకారుల ప్రతిభను తగిన గుర్తింపుతో సత్కరిస్తారు. ఈ క్రమంలో అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అథ్లెట్లకు ఇటీవల క్రీడా పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదుగురికి ఖేల్‌ రత్న, 27 మందికి అర్జున అవార్డులతో పాటు మొత్తం 75 మందికి ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ ఏడాది ఖేల్‌ రత్న అవార్డులు అందుకున్న ఐదుగురిలో ముగ్గురు మహిళలు ఉండటం విశేషం. అవార్డు దక్కిన వారిలో కొందరు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. వారిలో రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, స్టార్‌ ఇండియన్‌ క్రికెటర్‌ రోహిత్‌ శర్మ ఉన్నారు. కరోనా పాజిటివ్‌ రావడంతో వినేశ్‌‌ ఫోగట్‌ హాజరు కాలేదు. ఇక రోహిత్‌ శర్మ యూఏఈలోని ఐపీఎల్‌ కోసం సన్నద్దమవతున్నందున ఈ వేడుకకు దూరమయ్యారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులు హాజరయ్యారు. ఆట‌ల మంత్రి ప్ర‌సంగంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఏదాడి కోవిడ్‌ కారణంగా క్రీడా కార్యక్రమాలకు అవాంతరం ఏర్పడిందన్నారు. 2028 ఒలంపిక్స్‌ నాటికి పతకాల సాధనలో భారత్‌ టాప్‌-10లో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం దేశంలోని ప్రతిభావంతులైన అథ్లెట్లు, కోచ్‌లతో పాటు.. దేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి కృషి చేస్తున్న వివిధ సంస్థలను అవార్డులతో సత్కరించారు. ఈ సంవత్సరం ఖేల్‌ రత్న అవార్డు గ్రహీతల పేర్లను మొదట పిలిచారు, తరువాత ద్రోణాచార్య అవార్డు గ్రహీతలను ఆహ్వానించారు.

Leave A Reply

Your email address will not be published.