గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

హైదరాబాద్: గచ్చిబౌలిలో ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున విషాదం చోటు చేసుకుంది. విప్రో సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టిప్పర్ లారీ ఓ కారును వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా, ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు మృతిచెందారు.
పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూర్‌లోని ఓ వసతిగృహంలో ఉంటున్న కాట్రగడ్డ సంతోష్, భరద్వాజ్, పవన్, రోషన్, మనోహర్‌లు ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో కారులో గచ్చిబౌలి నుంచి గౌలిదొడ్డి వైపు బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు అతి వేగంతో విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్‌ను అదిగమించింది. ఈ క్రమంలో అటు నుంచి వస్తున్న టిప్పర్.. కారును ఢీ కొనడంతో రెండు వాహనాలు రోడ్డుపై పల్టీలు కొట్టాయి. కారు ఎగిరిపడటంతో రోడ్డు పక్కనే తాగునీటి కోసం ఏర్పాటు చేసిన షెడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జవ్వగా, మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి.
మృతులంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయి గూడెంకు చెందిన కాట్రగడ్డ సంతోష్ టెక్ మహీంద్రాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మృతుల్లో మరొకరైన చింతా మనోహన్ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన యువకుడు కాగా, పవన్ కమార్ నెల్లూరు జిల్లా వేదాయపాలెంనకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పప్పు భరద్వాజ్ విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌కు చెందిన వాసిగా పోలీసులు నిర్ధారించారు. నాగిశెట్టి రోషన్ స్వస్థలం నెల్లూరుగా గుర్తించారు.