గ్రేట‌ర్ ఫైట్‌: నేటి నుంచి కేటీఆర్‌ ప్రచారం

హైదరాబాద్‌ :జీహెచ్‌ఎంసీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయింది. ఇప్పటికే అధికార, విపక్షాలు ప్రచారంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై మరోసారి గులాబీ జెండా ఎగుర వేసే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. గతేడాది ఒంటి చెత్తో టీఆర్‌ఎస్‌ను గెలిపించాడు. అదే స్ఫూర్తితో నేటి నుంచి కేటీఆర్‌ రోడ్‌ షోలలో పాల్గొననున్నారు. శనివారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో రోడ్‌షో ప్రారంభించి.. కూకట్‌పల్లిలోనూ ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా, చిత్తారమ్మ తల్లి చౌరస్తా, రాత్రి 7గంటలకు ఐడీపీఎల్‌ చౌరస్తా, 8గంటలకు సాగర్‌ హోటల్‌లో జంక్షన్‌లో కేటీఆర్‌ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
ఆదివారం.. మహేశ్వరం, ఎల్బీ నగర్‌లో కేటీఆర్‌ రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉంటే…గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ముందుకు వెళుతోంది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్స్‌ను అధిష్టానం ప్రకటించింది. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌ రావు, తలసాని, ఈటల, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, కొప్పుల, పువ్వాడ అజయ్‌ పేర్లను హైకమాండ్‌ వెల్లడించింది.

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని గులాబీ దళం నిర్ణయించింది. డివిజన్లు, నియోజకవర్గ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు పూర్తి చేసింది. ఇందులో భాగంగా రోడ్‌ షోలకు ప్లాన్‌ చేస్తోంది. తక్కువ సమయంలో ఎక్కువ పర్యటనలు ఉండేలా ప్లాన్‌ చేస్తోంది. మిగతా పార్టీల కంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. అదే స్పీడ్‌తో ప్రచారంలోనూ దూసుకెళ్తోంది. రోజుకు నాలుగు నుంచి ఆరు చోట్ల మంత్రి కేటీఆర్‌ రోడ్‌ షో ఉండేలా ఏర్పాట్లు చేసింది. అలాగే పలు డివిజన్లలో రాష్ట్ర మంత్రులు అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించనున్నారు. గులాబీ ముఖ్యనేతలు ప్రచారం ప్రారంభిస్తుండడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.