గ‌బ్బా కోట బ‌ద్ద‌లు: టీమిండియా కొత్త చరిత్ర

గ‌బ్బా మైదానంలో ఆస్ట్రేలియా ఓడిపోవ‌డ‌మా ? ఇది న‌మ్మ‌లేని నిజం. అజేయ ఆస్ట్రేలియాను ఓడించింది టీమిండియానే. హేమాహేమీలు ఉన్న వెస్టిండీస్ జ‌ట్టు.. 1988లో గ‌బ్బా మైదానంలో టెస్టు మ్యాచ్‌ను గెలిచింది. ఆ త‌ర్వాత ఆస్ట్రేలియా జ‌ట్టును ఆ గ‌డ్డ‌పై దెబ్బ‌తీసిన జ‌ట్టేదిలేదు. కానీ తాజా సిరీస్‌లో టీమిండియా అనూహ్య రీతిలో త‌న స‌త్తా చాటింది. అత్యంత బ‌లంగా ఉన్న ఆసీస్ జ‌ట్టుకు జ‌ల‌క్ ఇచ్చింది. అపూర్వ‌మైన రీతిలో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ సిరీస్‌ను సొంతం చేసుకున్న‌ది. విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, శిఖర్ ధావన్‌, బుమ్రా, అశ్విన్ లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే పటిష్టమైన ఆసీస్‌ టీంపై విజయాన్ని సాధించి ఔరా అనిపించింది. 32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించింది.

బ్రిస్బేన్‌: భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ నాలుగో టెస్ట్‌లో టీమిం‍డియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్‌ ఛేదించింది. రిషభ్‌ పంత్‌ దూసుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్‌ తోడవడంతో ఆసీస్‌ గడ్డపై విజయాన్ని సాధించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుని గబ్బా మైదానంలో కంగరూలను గడగడలాడించింది. తాజా విజయంతో ఆసీస్‌ గడ్డపై భారత్‌ చరిత్ర సృష్టించింది.

యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (89 నాటౌట్‌) అర్ధ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ (91), టెస్ట్‌ స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా (56) అర్ధ సెంచరీలతో రాణించారు. ఈ విజయంతో కెప్టెన్‌ అజింక్య రహానే చరిత్రను తిరగరాశాడు. తాను సారథ్యం వహించిన ఏ టెస్టులోనూ భారత్‌ ఓడిపోలేదు. ఈ మ్యాచ్‌ విజయంతో భారత్‌ ఆసీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా కీలకమైన చివరి మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ 5 వికెట్లతో ఆసీస్‌ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.