చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
బైక్, లారీని ఢీ కొట్టిన కారు, నలుగురు మృతి

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న కారు బైకుతో పాటు పక్కనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. బంగారుపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు క్రాస్ చేస్తున్న బైకును వేగంగా వస్తున్న కారు వెనుక నుండి ఢీ కొట్టింది. అనంతరం రహదారి పక్కనే ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న వ్యక్తితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంగారుపాళెం మండలం తగ్గువారి పల్లెకు చెందిన బాబు (45) పలమనేరు నుంచి చిత్తూరు వైపు ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. పాలమాకులపల్లె సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా.. అతని వెనుక వస్తున్న కారు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఆ వెంటనే పక్కనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో బాబు తలపగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్‌రెడ్డి (29), రత్నం(49), శ్రీనివాసులు (55) కూడా ఘటనా స్థలంలోనే మృతిచెందారు. శిరీష (28) అనే మహిళ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.