భారీ వర్షాలతో తెలంగాణలో 30 మంది మృతి
హైదరాబాద్: జల ప్రళయం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. వరద నీటితో హైదరాబాద్ నగరం అల్లకల్లోలమైంది. రికార్డు స్థాయి వర్షపాతంతో రోడ్లు కాలువలయ్యాయి! కాలనీలు చెరువులయ్యాయి! నగరమే సాగరమైంది!తెలంగాణా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు..భీభత్సానే సృష్టించాయి. జోరు వానల కారణంగా 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు. రహదారులన్నీ నదులను తలపించాయి. వేలాది ఎకరాల పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమ్యాయి. చెట్లన్నీ నేల కొరిగాయి. విద్యుత్ స్థంభించిపోయి…ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఒక్క హైదరాబాద్‌లోనే 15 మంది వరకు మరణించారు. కౌంపౌండ్ గోడ కూలి తొమ్మిది మంది మృతి చెందిన సంగతి విదితమే. కొంచెం సేపు వర్షం తెరిపిచ్చినట్లే కనిపించినా…బుధవారం రాత్రి నుండి జోరున కురిసింది. తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావుతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ప్రధాని మోడీ సంభాషించారు. కేంద్రం నుండి తగిన సహాయం అందుతుందని హామీనిచ్చారు. ఆంధ్ర, తెలంగాణలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నానని,..ఆయా రాష్ట్రాల ప్రజలకు తగిన పరిష్కారం అందించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని హోం శాఖ మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.
వరుణుడి ఉగ్ర రూపానికి 1,500 పైగా కాలనీలు జలదిగ్బంధమయ్యాయి.. 20,540 ఇళ్లు నీట మునిగాయి. వరద ఉద్థృతికి పలువురు గల్లంతయ్యారు. 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి.. ఇదీ భాగ్యనగరం పరిస్థితి. వందేళ్ల తర్వాత కురిసిన రికార్డు వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంటర్ నెట్, మొబైల్ సిగల్స్ వ్యవస్థ విచ్ఛిన్నమయింది. మంగళవారం రాత్రికి ఉగ్రరూపం దాల్చిన వర్షం రికార్డు స్థాయిలో 192 మిల్లీ మీటర్లు కురిసింది. అర్ధరాత్రి సమయానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలతో పాటు చెరువులకు సమీపంలోని కాలనీలు, పలు బస్తీలు నీట మునిగాయి. నగరంలో ఉన్న చెరువులన్నీ పొంగి పొర్లడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగడంతో పరిస్థితి భయానకంగా మారింది. హైదరాబాద్‌లో ఎటు వెళ్లినా 5 అడుగుల పైనే వరద ప్రవహిస్తోంది. మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. పురానా పూల్, చాదర్ ఘాట్ ,మూసారం బాగ్ వద్ద వంతెనల పైనుంచి వరద ప్రవహిస్తోంది. నగరంలో డిఆర్ఎఫ్ టీంలు, అధికారులు ముందుగానే అప్రమత్తమైనా ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిందంటే తీవ్రతను అర్ధంచేసుకోవచ్చు. అపార్టుమెంట్లలో సెల్లార్లు నీటితో మునిగిపోయాయి. బుధవారం ఉదయం అధికారులు అతికష్టంమీద మర బోట్లలో రోడ్లపై తిరుగుతూ కాలనీల్లో పరిస్థితిని సమీక్షించారు. పేదలు నివశించే బస్తీల్లో పరిస్థితి వర్ణనాతీతం. ఇళ్లల్లో నడుం లోతు నీటిలో చిమ్మ చీకట్లో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ పిల్లా,పెద్ద జాగారం చేయాల్సివచ్చింది. అర్ధరాత్రి కురిసిన కుండపోత వర్షానికి పాతబస్తీలోని బార్కస్ వీధుల్లో ఓ వ్యక్తి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కూకట్పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రోడ్డుపై నిలిపిన కార్లు, ఇతర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. కాలనీల చుట్టూ నీరు పోటేయడంతో సమీపంలోని చెరువులకు గండి కొట్టేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏకధాటిగా కురిసిన వానలకు నాలాలు ఉప్పొంగాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులు తెగిపోయాయి. కుంటలు పొంగిపొర్లాయి. వాటిల్లో ఉండాల్సిన నీళ్లు రోడ్లు, కాలనీలు, ఇళ్లలోకి చేరాయి. విజయవాడ, కరీంనగర్, వరంగల్ మార్గాలు జలమయమయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లోని ఉత్తర, దక్షిణ జోన్లలో ఎక్కువ నష్టం వాటిల్లింది. నగరంలో 1,500 కాలనీలకుపైగా నీట మునిగాయి. సరూర్‌నగర్, గడ్డిఅన్నారం, దిల్సుఖ్నగర్ పాంతాల్లో దాదాపు 200 కాలనీలు జలమయమయ్యాయి. బోయిన్‌చెరువు తెగడం, హస్మత్‌పేట నాలా పొంగిపొర్లడంతో దాదాపు 100 కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, వనస్థలిపురం, బోయిన్పల్లి, మల్కాజిగిరి పాతబస్తీలోని పలు కాలనీలు నీటచిక్కి గజగజ వణికాయి. ఇళ్లలోని సామాన్లు కొట్టుకుపోయాయి. వరదనీరు బుధవారం మధ్యాహ్నానికి కూడా తగ్గలేదు. టోలిచౌకి నదీం కాలనీ, చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, ఫలక్‌నుమా, తదితర ప్రాంతాల్లో ప్రజలను బోట్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్, ఆర్మీ తదితర బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నగరంలోని 122 ప్రాంతాల్లో 20,540 ఇళ్లు నీట మునిగినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. దాదాపు పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు, లక్షా యాభై వేల మందికి ఆహారం అందజేసినట్లు తెలిపింది. 24 గంటలు పనిచేసే 30 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
(తప్పకచదవండిః అప్రమత్తంగా ఉండాలి: విద్యుత్ శాఖకు సిఎం కెసిఆర్ ఆదేశాలు )
ఆలయాల్లోకి చేరిన నీరు..
బల్కంపేట ఎల్లమ్మగుడిలోకి సైతం అమ్మవారి పాదా ల వరకు వర్షపునీరు చేరింది. దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి, పురానాపూల్ శివాలయాల్లోకి వరదనీరు చేరింది. వానకు తడిసిపోయి దా దాపు 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి. మూసారాంబాగ్ బ్రిడ్జి ఫెన్సింగ్ రెండువైపులా కొట్టుకుపోయింది. హుస్సేన్‌సాగర్ నీరు పూర్తిస్థాయి మట్టాని కంటే ఎక్కువై తూముల గుండా దిగువకు ప్రవహిస్తోంది. రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో రోడ్డుపై నిలిచిన నీటిని తొలగించేందుకు డివైడర్లు ధ్వంసం చేశారు. దిల్సుఖ్నగర్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. కోఠి– దిల్సుఖ్నగర్ మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. అలాగే ప్రధాన రహదారుల మార్గాల్లోని మలక్‌పేట రైల్వేస్టేషన్, డబీర్‌పురా కమాన్, యశోద ఆస్పత్రి, నల్ల గొండ క్రాస్‌రోడ్, శాలివాహన నగర్, సంతోష్‌నగర్ రాయల్సీ హోటల్, ఓల్డ్ చాంద్రాయణగుట్ట, హుమాయూన్‌నగర్, గుడిమల్కాపూర్, బజార్‌ఘాట్, బేగంబజార్, కింగ్‌కోఠి ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, కోఠి, అఫ్జల్‌గంజ్, బషీర్‌బాగ్, జియాగూడ, అశోక్‌నగర్ బ్రిడ్జి, ఇందిరాపార్కు, అంబర్‌పేట, నారాయణగూడ, తిలక్‌నగర్ జంక్షన్, రామంతాపూర్, నారాయణగూడ, ఫీవర్ హాస్పిటల్ల క్డీకాపూల్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.
(చూడండిః హైదరాబాద్‌లో వర్ష బీభత్సం (వీడియోలు)
తెలంగాణలో 30 మంది మృతి
హైదరాబాద్‌లో వరద బీభత్సానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. పలక్నామా వద్ద ఒక వ్యక్తి నీటిలో కొట్టుకుపోగా స్థానికులు, పోలీసుల కలిసి అతడిని రక్షించారు. బంజారా హిల్స్‌లో 49 ఏళ్ల వ్యక్తి విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. ఈ వరదల కారణంగా ఐదుగురు గల్లంతు అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సహాయక చర్యల నిమిత్తం ఎన్డిఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో సుమారు వెయ్యి మందిని ఎన్డిఆర్ఎఫ్ దళాలు రక్షించాయి. విద్యుత్ నిలిచిపోవడంపై తెలంగాణ మంత్రి కెటి రామారావు రాష్ట్ర దక్షిణ విద్యుత్ సరఫరా కంపెనీతో సమావేశమై…విద్యుత్ పునరుద్దరణకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా గురువారం కూడా ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఇల్లు
సికింద్రాబాద్‌లోని బౌద్ధనగర్ అంబర్‌నగర్‌లో నాలా పక్కన ఉన్న ఓ ఇల్లు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. భార్య, ఇద్దరు పిల్లలతో 69 గజాల్లో మూడు గదులు నిర్మించుకొని మహ్మద్ నజీముద్దీన్ నివసిస్తున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు వరద పోటెత్తింది. వర్షపు నీటితో బాగా నాని ఉండటంతో ఇల్లు కొట్టుకుపోయింది. బైక్, వాషింగ్ మెషిన్, అల్మారా, రూ. 50 వేల నగదు, 5 తులాల బంగారు నగలు, ఆధార్ కార్డులు, డ్యాకుమెంట్లు వరదలో కొట్టుకుపోయాయి.
వరదలపై సిఎం కెసిఆర్‌తో మాట్లాడిన రాష్ట్రపతి, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆరాతీశారు. బుధవారం గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మాట్లాడానని రాష్ట్రపతి ట్వీట్‌చేశారు. హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదల వల్ల కలిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల అనంతరం నెలకొన్న పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. పరిస్థితులను పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆదుకొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
జిల్లాలకు వర్ష సూచన
అతిభారీ వర్షాలు: జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, ములుగు, నారాయణపేట.
భారీ వర్షాలు: పెద్దపల్లి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం.
సాధారణ వర్షాలు: ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల.
అంబర్‌పేట ముసరాంభాగ్ వద్ద మూసీ వరదతో రాకపోకలు నిలిచిపోయిన దృశ్యాలు
(తప్పకచదవండిః వరద బీభత్సం: తెలంగాణలో 2 రోజుల సెలవు)
హైదరాబాద్‌లో ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది