చక్రవడ్డీ మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణయం
ఢిల్లీ: పండగ సీజన్లో రుణ గ్రహీతలకు ఊరట కల్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మారటోరియం కాలానికి రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయించింది. చక్రవడ్డీని మాఫీ చేస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2020 మార్చి 1వ తేదీ నుంచి ఆగస్టు 31 మధ్య కాలానికి చక్రవడ్డీ మాఫీ వర్తించనుంది. వీలైనంత త్వరగా చక్రవడ్డీ మాఫీ చేయాలని ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మేరకు చక్రవడ్డీని మాఫీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి మధ్య తేడా నగదును రుణగ్రహీత ఖాతాలో వేయాలని కేంద్రం నిర్ణయించింది. రుణ గ్రహీతలకు చెల్లించే మొత్తాన్ని బ్యాంకులకు కేంద్రం చెల్లించనుంది. సదరు రుణఖాతా ఈ ఏడాది ఫిబ్రవరి 29 నాటికి నిరర్ధక ఆస్తిగా ప్రకటించి ఉండరాదు అని తెలిపింది. చక్రవడ్డీ మాఫీతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ. 6,500 కోట్ల భారం పడనుంది. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. గృహ రుణాలు, విద్య, వాహన, ఎంఎస్ఎంఇ, వినియోగ వస్తువుల కొనుగోలు రుణాలు, వినియోగ రుణాలు వంటివి ఈ స్కీమ్ పరిధిలోకి వస్తాయి. ఈ రుణం వర్తించాలంటే ఫిబ్రవరి 29 నాటికి సదరు ఖాతా ఎన్పిఎగా గుర్తించి ఉండకూడదని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.