టి. వేదాంత సూరిః కాల ప్రవాహంలో అక్ష‌రం

కాలం ఒక ప్రవాహం, అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.. ఎన్నో లోయలు, వంపులు, మలుపులు. అన్నీ అధిగమిచ్చి నిరంతరం తనకు తాను ముందుకు సాగుతూనే ఉంటుంది.. ప్రవహించిన నీరు వెనక్కు రాదు.. అదే విధంగా చేజేతులా జారవిడుచుకున్న క్షణాన్ని మళ్ళీ వెనక్కు తీసుకోలేం. బాల్యం లో, యవ్వనం లో ఎన్నెన్నో క్షణాలను వృధా చేసుకుంటాం. వయసు పై పడిన తరువాత ఒక్క సారి వెనక్కు చూసుకుంటే. అదేదో విచిత్రమైన అనుభూతి.. అలా చేసి ఉండక పోవలసిందని.. అలాగే చేయడం మంచిదైందని అనుకుంటాం. అయితే ఆ సమయం లో మన అనుభవాలకు ఆ క్షణాలకు అక్షరాలూ తొడిగితే. అది భావి తరాలకు ఎంతో ఉపయోగ కరంగా ఉంటుంది.. మీ జీవితం లో అన్ని క్షణాలు గుర్తుండక పోవచ్చు.. కొన్ని సంఘటనలు ఎదురైనప్పుడు పాత ఘటనలు గుర్తుకు వస్తాయి.. ఈ జీవితం లో ఏదీ శాశ్వితం కాదు.. అన్నీ అశాశ్వితాలే.. కానీ మీ భావాలకు అక్షర రూపం ఇస్తే అవి శాశ్వతంగా చరిత్రలో పదిలంగా ఉంటాయి..

మీ మాటలకు పాట రూపం ఇస్తే అది గాయకుల గళం ద్వారా పదిలంగా అభిమానుల గుండెల్లో ఉండి పోతుంది.. మీరు రాసిన సంభాషణలకు నటీ నటుల ద్వారా చిత్ర రూపం ఇస్తే. అవన్నీ తరతరాల నిలిచి ఉంటాయి.. అందుకే మీ భావాలకు అడ్డుగోడలు వేయొద్దు. మీ మాటలు నిరంతరం ప్రవహించాలి. కొన్ని సంఘటనలు మన గుండెల్లో ఎప్పుడూ తడి తడిగానే ఉంటాయి.. వాటికి అక్షర రూపం ఇవ్వాలి.. సంఘటనలు ఊరికే గుర్తుండవు.. వాటి వెనుక కారణాలు ఉంటాయి.. అయితే అవి తీపి ఘటనలు కావచ్చు.. చేదు అనుభవాలు కావచ్చు.. అవి ఏవైనా అవి చదివితే పాఠకుల గుండెల్లో సూటిగా చొచ్చుకు పోతుంది.. వారి జ్ఞాపకాల్లో పదిలంగా నిలిచి పోతుంది.. బాల్యం లో అనుకోకుండా కాలికి తాకిన దెబ్బనే కావచ్చు.. కొన్నాళ్ల తరువాత ఆ గాయమే తీపి జ్ఞాపకం గా మారి పదే పదే గుర్తొస్తుంది. బాల్యపు ఆటలు, పాటలు,, వేసవిలో ఆరుబయట వేప చెట్టు కింద మంచం పై తమకు ఇష్టమైన కుటుంబ సభ్యలతో చెప్పుకున్న కబుర్లు… దశాబ్దాల తరువాత తలచుకుంటే ఒళ్ళు పులకరించి పోతుంది.ఆనాటి గుసగుసలు ఎప్పటికైనా గుర్తొస్తే పులకరింతగా ఉంటుంది.. అందుకే అందరూ తమ బాల్యానికి అక్షర రూపం ఇవ్వాలి.. అవి కష్టాలు కానివ్వండి.. సుఖాలు కానివ్వండి. ఆ కష్టాలలో కారిన కన్నీరు ఎప్పుడు గుర్తొచ్చినా ఆ క్షణాలను అధిగమించిన సంఘటనలు తలుచుకున్న ప్రతి సారి కళ్ళలో ఆనంద భాష్పా లు కళ్ళలో నుంచి జారుతుంటాయి.. అందుకే ప్రతిసారి మన అనుభవాలను, కష్టాలను, సుఖాలను గుర్తుచేసుకుంటూ.. ముందుకు సాగాలి.. అవే మనకు పాఠాలు, గుణపాఠాలు.. అందుకే రచయితలు, కవులు , మహనీయులు తమ బాల్యాన్ని అక్షరాల్లో పొదిగి పదిలంగా భావితరాలకు అందివ్వాలి.

Leave A Reply

Your email address will not be published.