టీటీడీ కీలక నిర్ణయం: రిటైర్డ్ అర్చకులు విధుల్లోకి చేరాలని ఆదేశం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయంలో పదవీ విరమణ చేసిన అర్చకులు తిరిగి విదుల్లో చేరేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. టిటిడి నిర్ణయంతో ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు విధుల్లో చేరనున్నారు. ఆయనతో పాటు పలువురు అర్చకులకు కూడా అవకాశం కలగనుంది.
అర్చకుల పదవీ విరమణపై మే 16, 2018 సంవత్సరంలో టిటిడి పాలక మండలి ఓ నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ వయస్సును నిర్ధారించి, అది దాటిన వారంతా పదవీ విరమణ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు నలుగురు ప్రధాన అర్చకులతో పాటు మరికొంత మంది అర్చకులు పదవీ విరమణ చేశారు. తర్వాతి కాలంలోనూ అదే కొనసాగింది. అయితే మండలి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2018లోనే అర్చకులు కోర్టును ఆశ్రయించారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న అర్చకులకు వయస్సు మళ్లిన్పటికీ విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు వెలువరించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి పేర్కొన్నది. టిటిడి నిర్ణయంతో గతంలో రిటైర్డ్ అయ్యిన రమణ దీక్షితులు తిరిగి ప్రధాన అర్చకుల హోదాలో ఆలయప్రవేశం చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు ఆ పోస్ట్ లోనే కొనసాగుతారా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. టీటీడీ నిర్ణయం పట్ల మాజీ అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.