తగ్గిన బంగారం, వెండి ధరలు..

ముంబయి: ఈ వారంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. గోల్డ్ ప్రైస్ రూ.48,000 దిగువకు వచ్చాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8,200కు పైగా తక్కువ పలికింది. శుక్రవారం దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసిఎక్స్ )లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.411 తగ్గింది. గత రెండు మూడు వారాలుగా పసిడి ధరలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఆగస్ట్ 7న ఆల్ టైమ్ గరిష్టం తర్వాత కొద్ది రోజుల్లోనే రూ.52వేలకు పడిపోయింది.
దాదాపు మూడు నెలల పాటు పసిడి రూ.49,500 నుండి రూ.52,000 మధ్య కదలాడింది. ఇటీవల వ్యాక్సీన్ అనుకూల ప్రకటనల నేపథ్యంలో మరోసారి పతనమయ్యాయి. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.8,000కు పైగా తగ్గిన పసిడి ధర ఇటీవలి రూ.52,000తో చూసినా రూ.4,000 తగ్గింది. ఈ నెలలోనే ఈ తగ్గుదల నమోదయింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.411.00 అంటే 0.85శాతం క్షీణించి రూ.48,106 వద్ద ముగిసింది. రూ.48,508.00 వద్ద ప్రారంభమై, రూ.48,647.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది. వెండి ధరలు చాలా రోజుల తర్వాత రూ.58,000 దిగువకు వచ్చాయి.
నష్టాలతో
ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 411 క్షీణించి రూ. 48,106 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్ ఫ్యూచర్స్ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 48,647 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 47,800 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్ ఫ్యూచర్స్ సైతం రూ. 773 నష్టపోయి రూ. 59,100 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 59,950 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 57,877 వరకూ వెనకడుగు వేసింది. గత ఐదు రోజుల్లో ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు రూ. 2,100 వరకూ నష్టపోయినట్లు బులియన్ విశ్లేషకులు తెలియజేశారు.
బలహీనపడ్డాయ్..
న్యూయార్క్ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు తాజాగా డీలా పడ్డాయి. పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1.25 శాతం పతనమై 1,788 డాలర్లను తాకింది. స్పాట్ మార్కెట్లోనూ మరింత అధికంగా 1.55 శాతం(28 డాలర్లు) పడిపోయి 1,788 డాలర్లకు చేరింది. వెండి ఏకంగా 3.5 శాతం కుప్పకూలి ఔన్స్ 22.64 డాలర్ల వద్ద నిలిచింది. గత వారం పసిడి ధరలు 4 శాతంపైగా జారినట్లు నిపుణులు పేర్కొన్నారు.