`తీన్మార్` సౌండ్ అదిరింది..!

హైద‌రాబాద్‌: ప్రజాబలం తోడుంటే ప్ర‌జాస్వామ్యంలో దేన్నైనా నెగ్గుకు రావొచ్చని చాటింది రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌. ఈ పోరుతో తెలంగాణలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. పోరాడి ఓడినా ప్రజాభిమానం సొంతం చేసుకున్నారు… అత‌ని తీన్మార్ ధ‌ర‌వు మండ‌లి పోరులో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ప్ర‌ధాన పార్టీల మాదిరి ఆయ‌న‌కు గ్రామ‌స్థాయి కార్య‌కర్త‌లు లేరు. అంగ‌, అర్థ బ‌లాలూ లేవు. ఉన్నది యూట్యూబ్‌ను ఆధారంగా చేసుకొని స‌మ‌స్య‌ల‌ను జ‌నంలోకి తీసుకెళ్లే నేర్ప‌రిత‌నం మాత్ర‌మే. ఈ బ‌లంతోనే నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ యువ సంచ‌ల‌నం.. తీన్మార్ మ‌ల్ల‌న్న అస‌లు పేరు చింత‌పండు న‌వీన్ (38).

దుబ్బాక, గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నికల్లో విజయాలతో ఊపుమీదున్న జాతీయ పార్టీ బిజెపి దూకుడుకు కళ్లెం వేసి మరీ సామాన్యుడి వెన్నుతట్టారు ప్ర‌జ‌లు. ఇక ఇక్క‌డ జ‌రిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోయిలో లేకుండా పోయింది. చివ‌ర‌కు కోదండ రామ్ సైతం వెనకబడిపోయారు. అతిక‌ష్టం మీద అధికార టిఆర్‌ఎస్ తన‌ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోగలిగింది.

జ‌నంలో మ‌ల్ల‌న్న‌

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు బిడ్డ మ‌ల్ల‌న్న‌. అర్ధ బ‌లం, అంగ బ‌లం లేకుండానే ఇప్ప‌టికి రెండు సార్లు పోటీ చేశారు. నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీచేశారు. అప్పుడు ప‌దివే‌ల ఓట్లు మాత్ర‌మే సాధించారు. త‌ర్వాత 2019లో జ‌రిగిన హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లోనూ స్వతంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి ఓట‌మిచ‌విచూశారు. ఈ రెండు ఓట‌ముల త‌ర్వాత `తీన్మార్` రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌జాసమ‌స్య‌ల‌పై ద‌రువు మొద‌లు పెట్టారు. గ‌త 4 నెల‌లుగా నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో పాద‌యాత్ర నిర్వ‌హించి ప్ర‌జా క్షేత్రంలోకి వెళ్లాడు. స్థానిక స‌మ‌స్య‌ల‌పై స‌ర్కార్‌ను ప‌లు సంద‌ర్భాల్లో నిల‌దీసేలా యువ‌కులను చైత‌న్యవంతం చేశారు. ఈ పాద‌యాత్ర మ‌ల్ల‌న్న‌ను ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర చేసింది.

ఇక్క‌డ ఇంకో ముఖ్య విష‌యం ఏంటంటే.. తాజాగా జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్ని‌కల్లో ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థుల‌కు మొద‌టి ప్రాధాన్య‌త ఓటు వేసిన వారిలో అధికులు రెండో ప్రాధ్యాన్య‌త ఓటు మాత్రం మ‌ల్ల‌న్న‌కే వేశారు. దాంతో ఈ మూడు ఉమ్మ‌డి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల ప్ర‌జ‌లు మ‌ల్ల‌న్న‌కు ఓటుతో జై కొట్టారని తెలుస్తోంది.. ప్ర‌జాబ‌లంతో అధికార పార్టీకి దీటుగా మ‌ద్ద‌తు పొందారు మ‌ల్ల‌న్న‌. దాంతో `తీన్మార్` ద‌రువు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌భంజ‌నం సృష్టించింది.

ఎన్నికల ఫలితాల అనంతరం తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తన ద్వారా ఫైట్ చేయాలని భావించారని. అందుకు ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఓటు వేసిన వారంద‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇకపై బ్యాలెట్ యుద్ధం చేయబోతున్నానని… ప్రతి గడపకూ పోతానని ఆయన ప్రకటించారు. ప్ర‌జ‌ల‌కు తాను చేసింది త‌క్కువేన‌ని.. ఇంకా చేయాల్సింది చాలా ఉంద‌ని మ‌ల్ల‌న్న అన్నారు.

Leave A Reply

Your email address will not be published.