తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 52,308 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం ఉదయం వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నలుగురు మృతిచెందారు. ఇదే సమయంలో 565 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య 2,77,151కు పెరగగాయి. ఇప్పటి వరకు 1,489 మంది కరోనాతో మృతిచెందారు.. 2,67,992 మంది రికవరీ అయ్యారు. ఇక, కరోనా మరణాలు దేశంలో 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు దేశంలో 94.9 శాతంగా ఉంటే, రాష్ట్రంలో 96.69 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,670 యాక్టివ్ కేసులు ఉండగా, వీరిలో 5,557 హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 52,308 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా టెస్ట్‌ల సంఖ్య 60,81,517కు చేరినట్టు ప్రభుత్వం పేర్కొంది.