తెలంగాణలో టీకా తీసుకున్న సఫాయి కర్మచారి కృష్ణమ్మ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. మరోవైపు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిసి ప్రారంభించారు. గాంధీ ఆస్పత్రిలో సఫాయి కర్మచారి ఎస్ కృష్ణమ్మ కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది. టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మంత్రి ఈటల రాజేందర్ సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు.
తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. ఒక్కో కేంద్రంలో 30 మందికి మించకుండా టీకాను వేస్తున్నారు. ఈ రోజు మొత్తం 4,170 మందికి టీకా వేయనున్నారు. టీకా వేసినట్లు గుర్తింపుగా లబ్ధిదారుడి ఎడమచేతి బొటనవేలికి సిరా చుక్కను గుర్తుగా వేస్తున్నారు. ఇవాళ మొత్తం పారిశుద్ధ్య కార్మికులకే టీకా ఇస్తున్నారు.
తిలక్‌నగర్‌లోని యూపీహెచ్‌సీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు టీకాల ప్రక్రియను ప్రారంభించారు.
[…] తెలంగాణలో టీకా తీసుకున్న సఫాయి కర… […]