త్వరలో కోనసీమలా సిరిసిల్ల: మంత్రి కెటిఆర్

సిరిసిల్ల (CLiC2NEWS): కెసిఆర్ సర్కార్ పేదోడి ప్రభుత్వమని మున్సిపల్ మంత్రి కెటిఆర్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కెటిఆర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. పేదలకోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇచ్చామని అన్నారు. సిరిసిల్ల నియోజక వర్గంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి కెటిఆర్ పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తున్నామన్నారు. పారదర్శకంగా ఇండ్లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. నిరుపేదల మొహాల్లో సంతోషం చూడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తాం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. కాళేశ్వరం నీటితో సిరిసిల్ల త్వరలో కోనసీమలా మారబోతోందన్నారు. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో రూ. కోటి నిధులతో త్వరలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.