దేవరగట్టులో సాగిన కర్రల స‌మ‌రం..

దేవరగట్టు: రాత్రి పదిన్నర వరకు ఎలాంటి హడావుడి లేక బోసిపోయినట్టు కనిపించిన తేరు బజారు ప్రాంతం ఒక్కసారిగా జనంతో కిక్కిరిసిపోయింది. దాంతో ప్ర‌తి యేటా జ‌రిగే బ‌న్ని ఉత్స‌వం య‌థావిధిగా కొన‌సాగింది. పోలీసు యంత్రాంగం క‌రోనా నేప‌థ్యంలో కొన్ని రోజుల కింద‌ట ఉత్స‌వాల‌ను నిషేధిస్తూ ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది. ఈ ఉత్స‌వాల‌కు ఎవ‌రూ రాకూడద‌ని పోలీసులు భారీ బందోబ‌స్సు ఏర్పాటు చేశారు. అయినా దేవరగట్టులోని కర్రలతో రణరంగం ఎలాంటి బెరుకూ లేకుండా సాగింది. సాంప్రదాయం ప్రకారం తాము తప్పకుండా కర్రల సమరంలో పాల్గొంటామని అక్కడి యువకుల, నిర్వాహకులు చెప్పడంతో.. ఈ కర్రల సమరాన్ని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. 30 చెక్‌ పోస్టులు, 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ భక్తులు కొండల మార్గం ద్వారా తరలివచ్చి బన్ని యాత్రలో పాల్గొన్నారు. తండా, కొత్తపేట, సుళువాయి గ్రామాల ప్రజలు దేవరగట్టుకు చేరుకుని కర్రల సమరంలో పాల్గొన్నారు. అర్చకులు స్వామి వారికి కల్యాణం నిర్వహించి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి కిందికి తీసుకొచ్చి సింహాసన కట్ట వద్ద ఉంచారు. అక్కడి నుంచి విగ్రహాలకు భక్తులు కర్రలు అడ్డుగాపెట్టి రాక్షసపడ వద్దకు తీసుకెళ్లారు. విగ్రహాలను చేజిక్కించుకునేందుకు జరిగిన కర్రల సమరంలో దాదాపు 50 మంది గాయపడగా, మ‌రో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.