నల్గొండలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి!

నల్గొండ:హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. కారు అదుపుతప్పి వాటర్ పైపులైన్‌ను ఢీకొట్టిన ఘటనలో యువకులు మృత్యువాతపడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున చింతపల్లి మండలం, ధైర్యపురి తండా సాగర్‌హైవేపై ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న 5 గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన నాగేంద్ర (28), వేముల భరత్ (24), గణేష్ (26), వీరితో పాటు మరో ఇద్దరు స్నేహితులు కారులో నాగార్జునసాగర్ వైపునకు బయలుదేరారు. మార్గమధ్యంలో నల్గొండ సమీపంలోని మలుపు వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న కృష్ణా నీటి సరఫరా దిమ్మెను డీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామ సర్పంచ్ ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.