నూత‌న వ్య‌వ‌సాయ బిల్లు తేనేపూసిన క‌త్తి

కార్పోరేట్ల కోసమే ఈ బిల్లు : సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లు కార్పోరేటు వ్యాపారులకు లాభం చేకూర్చేలా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు.
రాజ్య‌స‌భ‌లో బిల్లుకు వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని టీఆర్ఎస్ ఎంపీల‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూత‌న వ్య‌వ‌సాయ బిల్లు తేనేపూసిన క‌త్తి లాంటి చ‌ట్టం అని తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దీన్ని క‌చ్చితంగా వ్య‌తిరేకించి తీరాలి అని సీఎం స్ప‌ష్టం చేశారు. ఈ బిల్లును రాజ్యసభలో టిఆర్‌ఎస్‌ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని సిఎం కెసిఆర్‌ టిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కెశవరావుకు శనివారం వివరించారు. పైకి చెప్పడానికి రైతులు తమ సరుకును ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్పారు.. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధంగా ఉందన్నారు. దీంతో కార్పోరేట్‌ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు వేయడానికి ఈ బిల్లు దోహదపడుతుందన్నారు. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం అంటోంది… నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటు సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా ? ఈబిల్లు తేనె పూసిన కత్తిలాంటిది. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరుతామని సిఎం స్పష్టంచేశారు. ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉంటే, దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే 70-75 లక్షల టన్నులను కేంద్రం కొనుగోలు చేసిందని చెప్పారు. ఎవరి ప్రయోజనం ఆశించి 35 శాతం సుంకం తగ్గించారని కెసిఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారని నిలదీశారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం తీసుకొచ్చే విధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉంది కాబట్టి రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు సిఎం చెప్పారు. రాజ్యసభలో ఈ బిల్లుకు టిఆర్‌ఎస్‌ ఎంపిలు వ్యతిరేకంగా ఓటు వేస్తారని కెసిఆర్‌ స్పష్టంచేశారు.

బడా కంపెనీల కోసమే బిల్లు – ఎంపి నామా 

దేశవ్యాప్తంగా రైతాంగం దెబ్బతినేలా ఆర్డినెన్సులు తెచ్చారని టిఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నారు. బడా కంపెనీలకు మేలు జరిగేలా కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకొస్తున్నారని ఆరోపించారు. రైతాంగానికి నష్టం చేకూర్చేలా ఉన్న బిల్లులను రాజ్యసభలో అడ్డుకుంటామన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా టిఆర్‌ఎస్‌ ఎంపిలు ఓటు వేస్తారని కె. కేశవరావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.