నేటి తరం నాయకులకు నోముల ఆదర్శం: సిఎం కెసిఆర్
శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా..
హైదరాబాద్ : దివంగత నేత, నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య నిరంతరం ప్రజా సేవలోనే గడిపారని ముఖ్యమంత్రి కెసిఆర్ కొనియాడారు. ఆయన ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను.. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కెసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదు. నోముల నర్సింహయ్య వ్యక్తిగతంగా తనకు దగ్గరి మిత్రులు. చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి పని చేశాం. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమన్నారు.
ఉద్యమశీలి, ప్రజా నాయకుడు స్వర్గీయ నోముల నర్సింహయ్య.. బడుగు బలహీన వర్గాల వారికి తన జీవితాన్ని అంకితం చేశాడు. నోముల నిరంతరం ప్రజా సేవలో గడిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పాలెం గ్రామంలో పేద యాదవకుటుంబంలో జన్మించిన నోముల.. ఓయూలో ఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు నాయకత్వం వహించారు. పేద ప్రజల పక్షం వహించి ప్రజా న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. తన ఆశయాలకు అనుగుణంగా సీపీఎం పార్టీలో చేరారు. మండల పరిషత్ అధ్యక్షునిగా ప్రారంభమైన నోముల ప్రస్థానం ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. ఆయన ప్రసంగాలు ఎందరినో ఆకర్షించేవి. ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో ఆయన దిట్ట. నేటితరం నాయకులు నోముల నర్సింహయ్యను చూసి నేర్చుకోవాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల హక్కుల కోసం నర్సింహయ్య నిరంతరం పోరాడారు. నకిరేకల్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు పట్ల సీపీఎం పార్టీ వైఖరికి నిరసనగా ఆ పార్టీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 64 ఏండ్ల వయసులో గత డిసెంబర్‌లో గుండెపోటుతో మరణించడం తెలంగాణ ప్రజలకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన ఆత్మీయతను ఎప్పటికీ మరువలేను. నర్సింహయ్య ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అని సీఎం అన్నారు. సిఎం ప్రసంగం అనంతరం శాసనసభాపతి అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేశారు.
దివంగత ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నివాళి
తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న, అమరచింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డికి సభ నివాళులర్పించింది. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
శాసనసభ ప్రారంభమైన వెంటనే నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్, జైపాల్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ బలపరిచారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ బలపరిచి నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తెలిపారు.
నోముల జీవితం ప్రజాసేవకే అంకితం: మంత్రి జగదీశ్‌రెడ్డి
నోముల నర్సింహయ్య జీవితాంతం ప్రజాసేవకే పోరాటం చేశారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో భాగంగా మంగళవారం రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి పట్ల సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని రాజకీయాల్లో రాణించారన్నారు. భూస్వామ్య పెత్తందారీ వర్గాలను ప్రశ్నించిన గొంతుక నోములదన్నారు.
రైతులకు మద్దతుగా కృషి చేసేవారు: మంత్రి ఎర్రబెల్లి
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య రైతులకు మద్దతుగా నిరంతరం కృషి చేసేవారు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శాసనసభలో నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు దయాకర్‌రావు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. నోముల మరణం చాలా బాధాకరం. వారికి తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నోముల వరంగల్ బిడ్డను పెళ్లి చేసుకున్నారు. అలా ఆయన తనను మామ అని పిలిచేవారు. తాను కూడా నోములను అల్లుడి అని ఆప్యాయంగా పలుకరించేవాన్ని అని ఎర్రబెల్లి తెలిపారు. రైతులకు మద్దతుగా నిరంతరం కృషి చేసేవారు.
అణగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నాయకుడు నోముల: మంత్రి కెటిఆర్
అణగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నాయకుడిగా నోములకు పేరుందని మంత్రి కెటిఆర్ అన్నారు. శాసనసభలో నోముల మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎనిమిది సంవత్సరాలుగా నోములతో అనుబంధం ఉంది. అణగారిన వర్గాల కోసం గొంతు విప్పిన నాయకుడిగా నోములకు పేరుంది. ఎన్నో సందర్భాల్లో ఆయన తెలంగాణ గురించి మాట్లాడేవారు. నోముల మరణం సాగర్ నియోజకవర్గానికే కాకుండా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బడుగు, బలహీన వర్గాలకు తీరని లోటు అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.