నొప్పిగా ఉంది… నేను బతకను
యూపీలో ఆగని అత్యాచారాలు.. మరో దళిత యువతి మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలో మృగాళ్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. హత్రాస్ ఘటన మరువక ముందే మరో ఘోరం చోటుచేసుకుంది.
బల్రామ్పూర్కు చెందిన 22 ఏళ్ల యువతి మంగళవారం ఉదయం 10 గంటలకు కళాశాలకు ఇంటి నుంచి బయల్దేరింది. అనంతరం సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆ యువతిని ఇద్దరు యువకులు అడ్డగించారు. ఆమెకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశారు. కాగా, సాయంత్రం 7 గంటల సమయంలో నడవలేని స్థితిలో, చేతికి సెలైన్ బాటిల్తో ఈ-రిక్షాలో ఇంటికి చేరింది. తనకు కడుపులో ఏదో కాలిపోతున్నట్లు ఉందని, నడవలేనని తల్లికి చెప్పింది. తనను రక్షించాలను, తనకు చావాలని లేదని ఏడుస్తూ తన తల్లిని బతిమాలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక దవాఖానకు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమించడంతో.. మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే యువతి ప్రాణాలు విడిచింది. మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి అయింది. మృగాళ్లు ఆమె నడుమును విరచడంతో పాటు శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచారని డాక్టర్లు వెల్లడించారు. కాగా దుండగులు ఆమెను బలవంతంగా మత్తు మందు ఎక్కించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. “నాకు చాలా నొప్పిగా ఉంది… నేను బతకను“ అనేవి తన కూతురు చివరి మాటలని తల్లి విలపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసులు షహీద్, సాహిల్ అనే ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. గ్రామంలోని ఓ దుకాణంలో ఆమె పై దాడి జరిగినట్లు వారు భావిస్తున్నారు. కాగా హత్రాస్ మాదిరిగానే బాధితురాలి మృతదేహానికి కూడా హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించారు.