ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి సీఎం కెసిఆర్ గుడ్‌న్యూస్
నెలకు 2వేలు, 25కిలోల బియ్యం
హైదరాబాద్: కరోనా పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు పాఠశాలల సిబ్బందికి గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం ప్రకటించారు. నెలకు రూ. 2 వేల ఆపత్కాల ఆర్ధిక సాయం, రేషన్ షాపుల ద్వారా 25 కిలోల బియ్యం ఇవ్వాలని సిఎం నిర్ణయించారు. ఈ నిర్ణయంతో దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.
ఇందుకు సంబంధించి ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు. ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.
ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.