బైడెన్‌ మంత్రి వర్గంలో ఇద్దరు ఇండియ‌న్లు!

వాషింగ్టన్‌ :అమెరికా 46వ దేశాధ్య‌క్షుడిగా జో బైడెన్ ఎన్నికైన విష‌యం తెలిసిందే. అయితే బైడెన్ ఏర్పాటు చేయ‌బోయే మంత్రివ‌ర్గంలోకి ఇద్ద‌రు భార‌తీయ అమెరిక‌న్ల‌కు చోటు ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ఎన్నిక‌ల వేళ బైడెన్‌కు అడ్వైజ‌ర్‌గా ప‌నిచేసిన వివేక్ మూర్తికి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌నున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హెల్త్ అండ్ హ్యూమ‌న్ స‌ర్వీస్ మంత్రిగా వివేక్‌ను బైడెన్ నియ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ అరుణ్ మ‌జుందార్‌కు.. ఇంధ‌న శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కొన్ని క‌థ‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. బైడెన్ టీమ్‌కు సంబంధించిన లిస్టును ఓ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. 43 ఏళ్ల వివేక్ మూర్తి.. ప్ర‌స్తుతం కోవిడ్‌19 స‌ల‌హాదారుల బృందంలో ఉన్నారు. క‌రోనా వైర‌స్ విష‌యంలో ఆయ‌న బైడెన్‌తో క‌లిసి ప‌నిచేస్తున్నారు. స్టాన్‌ఫోర్డ్ లో మెకానిల్ ఇంజినీరింగ్ ప్రొఫెస‌ర్‌గా చేసిన మ‌జుందార్‌.. అక్క‌డే అడ్వాన్స్‌డ్ రీస‌ర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డైర‌క్ట‌ర్‌గా చేశారు. ఎన‌ర్జీ సంబంధిత అంశాల్లో బైడెన్‌కు అడ్వైజ‌ర్‌గా చేశారు. తాజాగా ముగిసిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన బైడెన్‌.. జ‌న‌వ‌రి 20వ తేదీన దేశాధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

వివేక్‌ మూర్తి…
వివేక్‌ మూర్తి అమెరికాలో మంచి పేరున్న వైద్యులు. ఒబామా, ట్రంప్‌ పాలన సమయంలో దేశానికి సర్జన్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు. పబ్లిక్‌ హెల్త్‌ సర్వీస్‌ కమిషన్‌ కోర్‌కు వైస్‌ అడ్మిరల్‌ హోదాలో విధులు నిర్వహించారు. డాక్టర్స్‌ ఫర్‌ అమెరికా సంస్థను స్థాపించారు. కర్ణాటక నుండి బ్రిటన్‌కు వలస వచ్చిన మూర్తి కుటుంబం ఆ తర్వాత అమెరికాలో స్థిర పడింది. ప్రతిష్టాత్మక హార్వర్డ్‌ యూనివర్శిటీ, యేల్‌ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. కొన్ని నెలలుగా బైడెన్‌కు కరోనాపై మార్గదర్శకత్వం చేస్తున్న ఆయన…మేలో ప్రచార బృందం ఏర్పాటు చేసిన హెల్త్‌ టాస్క్‌ ఫోర్స్‌కు కాంగ్రెస్‌ మహిళ ప్రమిలా జయపాల్‌తో కలిసి నేతృత్వం వహించారు. అధికార మార్పిడి తర్వాత బైడెన్‌ నియమించే కోవిడ్‌-19 అడ్వైజరీ బోర్డుకు వివేక్‌ మూర్తి సహ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

అరుణ్‌ మజుందార్‌
అరుణ్‌ మజుందార్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌. అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్ట్స్‌ ఏజెన్సీ- ఎనర్జీకి తొలి డైరెక్టర్‌గా పనిచేశారు. 2009లో అప్పటి అధ్యక్షుడు ఒబామా..అరుణ్‌ మజుందార్‌ను ఆ పదవికి నామినేట్‌ చేశారు. సెనేట్‌ ఆమోద ముద్ర వేసింది. 2012 వరకు అరుణ్‌ ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత గూగుల్‌లో చేరిన ఆయన.. ఆ సంస్థ ఎనర్జీ విభాగానికి ఉపాధ్యక్షునిగా పనిచేశారు.

Leave A Reply

Your email address will not be published.